కొత్త పార్టీని స్థాపించిన సివిల్స్‌ టాపర్‌

Former IAS Officer Shah Faesal Launch New Political Party in Srinagar - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, 2010 సివిల్స్‌ టాపర్‌ షా ఫైజల్ ఆదివారం జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రాజ్‌బాగ్ పట్టణంలోని గిండున్ గ్రౌండ్‌లో పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఫైజల్ తెలిపారు. కశ్మీరీలపై నిరాటంకంగా కొనసాగుతున్న ఆకృత్యాలు, అణచివేతను నిరసిస్తూ యూపీఎస్సీ 2010 బ్యాచ్ టాపర్ అయిన ఫైజల్.. ఐఏఎస్ పదవికి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేంద్రం కీలక ప్రభుత్వ సంస్థలను నాశనం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహార తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిం, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫైజల్‌ ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శక రాజకీయాల కోసం తనకు మద్దతుగా నిలువాలని కొంతకాలంగా యువతతోపాటు వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్‌లో శాంతిని కోరుకుంటున్న పలువురు యువనాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆయన ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top