
ఢిల్లీ : వచ్చే 2019 లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశానికి రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో ఏఏ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించే అధికారం రాహుల్ గాంధీకి కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిందని తెలిపారు.
వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్తాన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. బీజేపీ రాక్షస పాలన అంతమొందించాలని కోరుతూ, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పాలనలో న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక హోదా అమలులోకి తీసుకువస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశంలో చెప్పారని రఘువీరా రెడ్డి తెలిపారు.