
సాక్షి, అమరావతి :ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలకు పెద్ద నోట్లు లభించడం లేదు. ఓట్ల కొనుగోలు కోసం రాజకీయ నాయకులు పెద్ద నోట్లను దాచుకోవడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏది కొందామన్నా చిల్లర దొరక్క చికాకు పుట్టించే పెద్ద నోట్లు మాయమయ్యాయి. ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేస్తుంటే అక్కడ కూడా కేవలం 500, 200, 100 నోట్లే ఉంటున్నాయి. బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పంపిణీ చేసే నగదు ఒక్కటేమిటి ఎక్కడ వెతికినా చిల్లర నోట్లే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు రూ.2 వేల నోటు రావటం బాగా తగ్గిపోయిందని, కొంతమంది అవే నోట్లు కావాలని పట్టుబడుతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. రోజువారీగా బ్యాంకులకు జమయ్యే లావాదేవీల్లో సాధారణంగా వచ్చే పెద్ద నోట్లు బాగా తగ్గిపోయాయని ఓ బ్యాంక్ క్యాషీయర్ తెలిపారు.
ముందే దాచుకున్న అధికార పక్షం...
అధికారంలోకి మళ్లీ వచ్చిన అనంతరం ప్రజల నుంచి దోచుకోవచ్చని అధికార తెలుగుదేశం నేతలు ముందు జాగ్రత్తగా పెద్ద నోట్లను దాచుకున్నారని వినిపిస్తోంది. అందులో భాగంగా చిన్న చిన్న పనుల మొదలు పెద్ద కాంట్రాక్టు వరకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మొత్తం పెద్ద నోట్ల రూపంలో మార్చుకొని చలామణి కాకుండా ఆపేశారు. అధికార పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు 30 నుంచి
50 కోట్ల వరకు నగదును ఇప్పటికే సిద్ధం చేసుకొని ఉన్నారని సమాచారం.
వందకు రూ.5 వేల కమీషన్
పెద్ద నోట్ల సేకరణ కోసం కమీషన్ ఇచ్చే సాంప్రదాయం కూడా రాష్ట్రంలో నడుస్తోంది. వంద రూ.2 వేల నోట్లు ఇచ్చిన వారికి రూ.3 నుంచి రూ.5 వేల వరకు కమీషన్ ముట్టుతోందని సమాచారం. రోజువారీ డబ్బులు వసూల్ చేసేవారు, కొంత మంది వ్యాపారులు ఈ కమీషన్ తీసుకొని పెద్ద నోట్లను రాజకీయ నాయకులకు సరఫరా చేస్తున్నారు. దీంతో దేశంలో చలామణిలో ఉన్న నగదులో దాదాపు 37 శాతం ఉన్న రూ.2 వేల నోటు, 43 శాతం ఉన్న రూ.500 నోట్లకు గిరాకీ పెరిగింది. మరోవైపు కనిపించకుండా పోయిన ఈ నోట్లన్ని ఎన్నికల ముందు రెండు రోజుల నుంచి ఓటర్ల చేతిలో ప్రత్యక్షమవుతాయని ప్రజల్లో చర్చలు కొనసాగుతున్నాయి. నోటుకు కక్కుర్తిపడితే దోపిడీకి గురవుతామని హెచ్చరించుకుంటున్నారు.
- లవకుమార్ రెడ్డి, అమరావతి