
సాక్షి, చెన్నై: తమిళులు అమితంగా అభిమానించే పెరియార్ రామస్వామిపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి కలలో కూడా పెరియార్‌పై వ్యాఖ్యలు చేసే ఆలోచన ఎవరికీ రాకూడదన్నారు. పెరియార్ విగ్రహాల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని అన్నారు. దమ్ముంటే ఎవడైనా పెరియార్ విగ్రహాన్ని ముట్టుకోమని సవాల్ చేశారు.
కొందరి పిచ్చి పరాకాష్టకు చేరి.. పెరియార్‌పై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేత హెచ్ రాజాపై మండిపడ్డారు. ద్రవిడ జాతి తలుచుకుంటే వారికి ఏ గతి పడుతుందో ఇకపై వారికి బాగా అర్ధం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉండటం వల్లే పెరియార్‌పై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.