హోటల్‌ వద్ద హైడ్రామా, శివకుమార్‌కు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

రెబల్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌ వద్ద హైడ్రామా

Published Wed, Jul 10 2019 9:17 AM

DK Shivakumar Stopped Outside Mumbai Hotel - Sakshi

సాక్షి, ముంబై : కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ముంబైలో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. అసంతృప్త కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన డీకే శివకుమార్‌కు చుక‍్కెదురు అయింది. హోటల్‌ బయటే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్‌ లోనికి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ శివకుమార్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రెబల్స్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు చర్చలకు రమ్మంటేనే తాను వచ్చానని అన్నారు. అంతేకాకుండా తాను కూడా హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకున్ట్లు ఆయన తెలిపారు. భద్రత పేరుతో తమను అడ్డుకుంటున్నారంటూ శివకుమార్‌ ఆరోపించారు. స్నేహితులను కలిసేందుకే ముంబై వచ్చానని, ఎమ్మెల్యేలను కలవకుండా వెనక్కి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. శివకుమార్‌తో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగగౌడ కూడా ముంబై వచ్చారు.  మరోవైపు సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్‌ వల్ల తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాయడంతో హోటల్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

చదవండికర్నాటకంలో కొత్త ట్విస్ట్‌

ముంబై నుంచి పుణె, లేదా గోవా
సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ముంబై స్టార్‌ హోటల్‌లో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ రాజీనామాలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తీసుకునే నిర్ణయంపై ఎక్కడకు వెళ్లాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మూడు రోజులుగా రాజీనామా చేసిన 14మంది ఎమ్మెల్యేలు ముంబైలోనే ఉంటున్నారు. స్పీకర్‌ తమ రాజీనామాలు అంగీకరించిన అనంతరమే తాము బెంగళూరు వస్తామని అసమ్మతి ఎమ్మెల్యేలు తెలిపారు. ఒకవేళ ఆమోదం పొందకుండా చేస్తే తాము ఇక్కడి నుంచి గోవా, లేదా పుణె వెళ్లడానికి నిర్ణయించుకున్నామని అసమ్మతి ఎమ్మెల్యేలు తెలిపారు. ఇదిలా ఉంటే అసమ్మతి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా వారికి బీజేపీ నాయకులు సకల సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రపతి పాలన తప్పదా?
తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కన్నడనాట రాష్ట్రపతి పాలన తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  సుమారు 14 మంది కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్, గవర్నర్‌ తీసుకునే నిర్ణయంపైనే ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మద్దతు లేక పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసులు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గాల్లో దీపంలా మారిపోయింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో తెలియని గందరగోళం నెలకొంది. 

గవర్నర్‌ ఏమంటారు?  
అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపులకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలాగే రాజీనామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే బీజేపీ లోలోపల తన కార్యాచరణను అమలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల రాజీనామాలు చేయడంతో సంకీర్ణం మైనారిటీలో జారిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నర్‌ వజుభాయి వాలా కుమారస్వామి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలనకే సిఫార్సు చేస్తారా అనేది సస్పెన్స్‌గా మిగిలింది.  

మైనారిటీలో కుమార సర్కారు  
224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి 78, జేడీఎస్‌కు 37 మంది, బీజేపీకి 105 మంది,  బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారపక్షానికి మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో ఆ బలం 103కు క్షీణించింది.  సర్కారు ఏర్పాటుకు 113 మంది శాసనసభ్యుల బలముండాలి. గ తంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ముందుగా బలపరీక్షకు అధికార పక్షాల్ని గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నిర్ణయమే కీలకంగా మారింది.  

బలపరీక్షకే సీఎం మొగ్గు  
బలపరీక్షకు సిద్ధంగా ఉండాలని సీఎం కుమారస్వామి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. బలం చాటుకోవడానికి విశ్వాస పరీక్షను ఎదుర్కొవడమే ఉత్తమమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష సందర్భంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు కూడా విప్‌ జారీ చేయవచ్చని, విప్‌కు భయపడి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని భావిస్తున్నారు. ఒకవేళ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్షలో ఓటు వేస్తే సంబంధిత ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.  

సంకీర్ణానికే మహేశ్‌ మద్దతు  
నానాటికీ బలం కోల్పోతున్న సంకీర్ణ ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేశ్‌ మద్దతు ప్రకటించారు. మంగళవారం విధానసౌధ కార్యదర్శితో భేటీ అయి సర్కారుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించి వెళ్లిపోయారు.  

Advertisement
Advertisement