ఐటీ వలలో కమీషన్ల ‘బాస్‌’!

Diversion of funds deposited into Chandrababu And Lokesh benami accounts and companies - Sakshi

బినామీ ఖాతాలు, కంపెనీల్లోకి కాజేసిన నిధుల మళ్లింపు

ముంబైకి చెందిన బడా కాంట్రాక్టు సంస్థపై ఐటీ శాఖ దాడులతో కదిలిన డొంక

కీలక ఆధారాలు లభించడంతో చంద్రబాబు, లోకేష్‌ సన్నిహితుల నివాసాలు, షెల్‌ కంపెనీల్లో సోదాలు

టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా ఖాతాల్లోకి భారీగా నిధులు

ప్రత్తిపాటి కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా ఖాతాల్లోకీ తరలింపు 

ఒక్క అవెక్సా ఇన్‌ఫ్రా నుంచే రూ.69 కోట్ల జీఎస్టీ ఎగవేత

నకిలీ లావాదేవీలు గుర్తించి రంగంలోకి దిగిన జీఎస్టీ ఇంటెలిజెన్స్‌

ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చిన వ్యవహారంలోనూ వెలుగు చూస్తున్న వాస్తవాలు

సాక్షి, అమరావతి: కమీషన్ల ‘బిగ్‌బాస్‌’ ఆదాయపు పన్నుశాఖ చేతికి చిక్కినట్లేనా! కాంట్రాక్టు సంస్థల నుంచి ‘బిగ్‌బాస్‌’ వసూలు చేసిన ముడుపులు బినామీ ఖాతాల్లోకి మళ్లాయా? అక్కడి నుంచి కుటుంబ సంస్థల ఖాతాల్లోకి చేరవేశారా? అనే ప్రశ్నలకు ఐటీ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. పక్కా ఆధారాలతోనే ‘పెదబాబు’, ‘చినబాబు’ బినామీ సంస్థలు, బినామీల ఇళ్లల్లో రెండు రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దాదాపు దశాబ్దం పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాస్, లోకేష్‌ ఆంతరంగికుడు, కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌ పూర్తి కాలపు డైరెక్టర్‌ కిలారు రాజేష్, వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్‌ కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి,  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శర్‌త్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రాలలో గురువారం ఉదయం ఏకకాలంలో ఐటీ అధికారుల బృందాలు దాడులు ప్రారంభించాయి. శుక్రవారం కూడా కొనసాగిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఎలాంటి పనులు చేయకుండానే కాంట్రాక్టు సంస్థల నుంచి బిల్లుల రూపంలో కమీషన్లు వసూలు చేసిన తీరు బహిర్గతమైంది. జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా రంగంలోకి దిగి కూపీ లాగుతోంది. 

ముంబై కేంద్రంగా కదిలిన డొంక..
ఐదేళ్ల పాలనలో పనుల అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడి పెంచేయడం, ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్లు నిర్వహించడం, అధిక ధరలకు కట్టబెట్టి ముడుపులు వసూలు చేసుకోవడాన్ని టీడీపీ పెద్దలు రివాజుగా మార్చుకున్నారు. కాంట్రాక్టు సంస్థల నుంచి వసూలు చేసిన కమీషన్లను బినామీ సంస్థలు, బినామీల ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి కుటుంబ వ్యాపార సంస్థల్లోకి, విదేశాలకు దారి మళ్లించడంలో ఆరితేరారు. ముంబై కేంద్రంగా పనిచేసే ఓ బడా కాంట్రాక్టు సంస్థకు చెందిన కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్లకుపైగా ముడుపులు అందాయని పక్కా ఆధారాలను సేకరించినట్లు ఐటీ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఆ తీగ లాగితే చంద్రబాబు, లోకేష్‌ అక్రమాల డొంక కదులుతోంది.

బినామీ ఖాతాల్లోకి ముడుపులు..
నారా లోకేష్‌ తమ కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌లో కిలారు రాజేష్‌ను పూర్తి కాలపు డైరెక్టర్‌గా నియమించుకున్నారు. లోకేష్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యవహారాలను రాజేషే చక్కబెట్టేవారు. ముంబై కేంద్రంగా పని చేసే ఓ బడా కాంట్రాక్టు సంస్థ నంచి పెదబాబు వసూలు చేసిన ముడుపుల్లో కొంత భాగాన్ని కిలారు రాజేష్‌కు చెందిన రెండు షెల్‌ కంపెనీల ఖాతాల్లో జమ కావడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు రెండు రోజులుగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అతడి నివాసం, సంస్థల్లో దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలు కీలక ఆధారాలను సేకరించారు. మరో మూడు బడా కాంట్రాక్టు సంస్థల నుంచి చంద్రబాబు వసూలు చేసిన ముడుపులను కిలారు రాజేష్‌ షెల్‌ కంపెనీల్లో జమ చేసినట్లు గుర్తించారు. 

కీలక ఆధారాలు లభ్యం..
చంద్రబాబు 2009 –  2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, 2014 – 2019 వరకు సీఎంగా ఉండగా శ్రీనివాస్‌ ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. శ్రీనివాస్‌ వ్యక్తిగత ఖాతాతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఏర్పాటు చేసిన షెల్‌ కంపెనీల్లోనూ బడా కాంట్రాక్టు సంస్థల నుంచి చంద్రబాబు వసూలు చేసిన ముడుపులను జమ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్‌ నివాసాల్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు ఈమేరకు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది.

పనులు చేయకుండా లావాదేవీలా..!
కాంట్రాక్టు సంస్థల నుంచి వసూలు చేసిన నల్లధనాన్ని మార్చుకునేందుకు పెదబాబు, చినబాబు తమదైన శైలిలో పావులు కదిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బడా కాంట్రాక్టు సంస్థల వద్ద వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్‌ కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డిలు ఎలాంటి పనులు చేయలేదు. కానీ సబ్‌ కాంట్రాక్టు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. వాటికి బిల్లులు చెల్లించినట్లు చూపి ఆర్కే ఇన్‌ఫ్రా, సుబ్బారెడ్డి సంస్థల ఖాతాల్లో ముడుపులను జమ చేయించారు. దీనిపై పక్కా ఆధారాలను సేకరించిన ఐటీ అధికారులు ఆర్కే ఇన్‌ఫ్రాతోపాటు శ్రీనివాసులురెడ్డి, సుబ్బారెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టు సంస్థలు ఏవైనా లావాదేవీలు జరిపితే జీఎస్టీ చెల్లించాలి. అయితే జీఎస్టీ చెల్లించకపోవడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు సమాచారం ఇవ్వడంతో జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది.

ప్రత్తిపాటి కుమారుడి సంస్థ ఖాతాలోకీ..
చంద్రబాబు సన్నిహితుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా పెద్దగా కార్యకలాపాలు నిర్వహించిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో భారీ ఎత్తున కాంట్రాక్టులు పొందిన నాలుగు సంస్థల వద్ద అవెక్సా ఇన్‌ఫ్రా సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేసినట్లు చూపి.. వారి వద్ద నుంచి వసూలు చేసిన ముడుపులను బిల్లుల రూపంలో చెల్లించినట్లుగా ఆ సంస్థ ఖాతాలోకి మళ్లించారు. ఐటీ అధికారులు హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయం, శరత్‌ ఇళ్లల్లోనిర్వహించిన సోదాల్లో ఇది వెలుగు చూసింది. రూ.69 కోట్లను జీఎస్టీగా అవెక్సా ఇన్‌ఫ్రా చెల్లించాలి. అవెక్సా ఇన్‌ఫ్రా దీన్ని ఎగ్గొట్టినట్లు గుర్తించిన ఐటీ అధికారులు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి సమాచారం అందజేశారు.

ముడుపులే ఇం‘ధనం’గా..:
చంద్రబాబు బడా కాంట్రాక్టు సంస్థలకు ఖజానాను దోచిపెట్టి వసూలు చేసిన ముడుపులను కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇం‘ధనం’గా సమకూర్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానానికి భారీగా ముడుపులు అందజేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులకు భారీ ఎత్తున నిధులు పంచిపెట్టి ఓటర్లపై ధనాస్త్రాన్ని ప్రయోగించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చక్రం తిప్పాలని పథకం వేశారు. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు ఐటీ శాఖ చేతికి చిక్కినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు ఎన్నికల ఇంధనం సమకూర్చే క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేత సమీప బంధువుకు చెందిన కాంట్రాక్టు సంస్థ ఖాతాలోకి తన బినామీ సంస్థ నుంచి నిధులు జమ చేసినట్లు గుర్తించారు. ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం ఈ అంశంపై లోతుగా పరిశీలన చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top