పండుగ ప్యాకేజీ!

Distribution Heavily Alcohol And Meat By Municipal Contestants In Telangana - Sakshi

ఓటర్లకు మున్సిపల్‌ అభ్యర్థుల సంక్రాంతి తాయిలాలు

పండుగ ఖర్చు తీర్చేలా భారీగా మద్యం, మాంసం పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ముంగిట సంక్రాంతి పండుగ రావడంతో అభ్యర్థులు ముందుగానే తాయిలాల పంపిణీకి తెరతీశారు. భోగి, సంక్రాంతి, కనుమ నేపథ్యంలో వరుసగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలికల్లో విచ్చలవిడిగా ఇంటింటికీ పండుగ ప్యాకేజీలను సరఫరా చేశారు. ‘భోగి నుంచి కనుమ వరకు పండుగ ఖర్చు మొత్తం మాదే.. మీరేం ఫికర్‌ కావద్దు’అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. కిలో మటన్‌ లేదా రెండు కిలోల చికెన్, పిండి వంటల కోసం 5 లీటర్ల వంట నూనె ప్యాకెట్లు, రెండు కిలోల బియ్యం, కిలో శనగ పిండి, ఉప్పు, పప్పు కారం వంటి పదార్థాలతోపాటు ఫుల్‌ బాటిల్‌ విస్కీ లేదా ఐదారు బీరు సీసాలతో ప్యాకేజీలు మూటగట్టి ఓటర్లకు పంపిణీ చేశారు.

మాంసం దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో ప్యాకేజీలను తయారు చేసి ఓటర్ల ఇళ్లకు చేరవేశారు. కొన్ని చోట్ల మద్యం దుకాణాల యజమానులే అభ్యర్థుల తరఫున ఓటర్లకు మద్యం, మిక్చర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అభ్యర్థి వెంట ప్రచారంలో తిరిగిన వారికి మామూలు రోజుల్లో క్వార్టర్‌ విస్కీ పంపిణీ చేస్తే పండుగ రోజుల్లో తలా ఒక ఫుల్‌ బాటిల్‌ సరఫరా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడంలో చివరి రెండు రోజులు కీలకం. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాల గడువు ముగిసిపోనుంది.

అనంతరం భారీ ఎత్తున డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే సంక్రాంతి పండుగ రావడంతో పోలింగ్‌కు ఐదారు రోజుల ముందే అభ్యర్థులు భారీ ప్రలోభాలకు తెరతీసినట్లు చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ నెలకొన్న వార్డులు/డివిజన్లలో పోటాపోటీగా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. బీజేపీ లేదా స్వతంత్ర అభ్యర్థి రూపంలో త్రిముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు డబుల్, త్రిబుల్‌ బోనంజాలు అందుకుంటున్నారు.

శివార్లలో శివాలెత్తిన ప్రలోభాలు..
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపరంగా ప్రాధాన్యతగల ఈ పురపాలికల్లోని కొందరు ‘బడా అభ్యర్థులు’విచ్చలవిడిగా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌/మేయర్‌ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులైతే గెలుపే లక్ష్యంగా రోజూ రూ. లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. సంక్రాంతి రోజు నగర శివారు మున్సిపాలిటీల్లో చాలా మంది అభ్యర్థులు ఇంటింటికీ పండుగ ప్యాకేజీలు పంపించి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు.

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించనుండటం తెలిసిందే. ఇందులో 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు హైదరాబాద్‌ శివార్లలో ఉన్నవే. శివారు మున్సిపాలిటీల్లో పండుగ ప్యాకేజీలతోపాటు పురుషుల కోసం ఫుల్‌బాటిల్‌ మద్యం, మహిళల కోసం శీతల పానీయాలను సైతం ఓటర్ల ఇళ్లకు పంపిణీ చేశారు. స్థానిక సూపర్‌ మార్కెట్లకు ఆర్డర్లు ఇచ్చి మరీ 5 లీటర్ల వంట నూనె, 2 కిలోల గోధుమ పిండి, కిలో శనగ పిండితో ప్రత్యేక ప్యాకెట్లు తయారీ చేయించినట్లు చర్చ జరుగుతోంది. కిలో మటన్‌/2 కిలోల చికెన్‌తోపాటు ఈ ప్యాకెట్లను ఓటర్ల కుటుంబాలకు అందజేశారు. గట్టి పోటీ ఉన్న చోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులూ పండగ ’ప్యాకెట్ల’లను అందజేయడంతో ఓటర్లకు మొత్తం మీద పండుగ ఖర్చు తీరింది.

ఉదాహరణకు తాండూరు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ రోజు మద్యం, మాంసం, నగదుతో ఎర వేశారు. బుధవారం సంక్రాంతి రోజున చికెన్, మటన్‌ సెంటర్లలో మాంసం ప్యాకెట్లు సిద్ధం చేసి ఇంటింటికీ పంచారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఓటర్లకు పండుగ రోజు చీరలు పంపిణీ చేస్తే ఆయనకు పోటీగా మరో అభ్యర్థి ఓటరుకు రూ. వెయ్యి చొప్పున పంచాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.

జప్తులేవీ..?
మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను గత నెల 23న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సంక్రాంతి రోజు చాలా మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా పండుగ ప్యాకేజీలు, డబ్బు, మద్యం పంపి ణీ చేసినా స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి జప్తు చేసుకున్న మద్యం, డబ్బు, ఇతరత్రా కానుకల వివరాలను ఎస్‌ఈసీ రోజువారీగా ప్రకటించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి 3  వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎక్కడా ఏమీ జప్తు చేయలేదని తెలుస్తోంది. పోలింగ్‌కు మరో 5 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఎన్నికల సంఘం ప్రలోభాలకు అడ్డుకట్ట వేసే అంశంపై దృష్టి సారించాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top