అమరావతిలోనే తేల్చుకుంటా..

Dissatisfaction In Grand Alliance - Sakshi

హైదరాబాద్‌: సీట్ల పంపకం మహాకూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు స్థానాలతో టీడీపీ నిన్న విడుదల జాబితా.. కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేసింది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడం పట్ల సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌లు తీవ్రంగా రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో మల్‌రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతానని అనుచరులతో చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి.

క్యామ మల్లేష్‌ కూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వనస్థలిపురంలోని ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌ నేత మల్‌ రెడ్డి రంగారెడ్డి అనుచరులు మంతనాలు కూడా జరిపారు. మల్‌రెడ్డి సోదరుడు రాంరెడ్డి, సామ రంగారెడ్డితో రహస్య భేటీ జరిపినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి పేరు ప్రకటించడంపై మల్‌రెడ్డి, క్యామ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయమై అమరావతి వెళ్లి చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని సామ రంగారెడ్డి చెప్పినట్లుగా తెలిసింది.

ఎల్బీనగర్‌ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తనకు కేటాయించడంపట్ల సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 11 ఏళ్ల నుంచి టీడీపీని ఎల్బీనగర్‌లో బలోపేతం చేశానని సామ రంగారెడ్డి మీడియాతో తెలిపారు. ఎల్బీనగర్‌లో ఏ వార్డులోనూ కాంగ్రెస్‌కు టీడీపీ కంటే ఆధిక్యం రాదని అన్నారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ తనకు రావడంతో కాంగ్రెస్‌ నేత మల్‌ రెడ్డి రంగారెడ్డి తన వద్దకు వచ్చి మంతనాలు జరిపారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ ఎందుకు తనకు ఇచ్చారని మల్‌రెడ్డి ప్రశ్నించారని తెలిపారు. దమ్మూ, ధైర్యం లేని నేతల వద్ద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top