రాజీనామాలు చేయకుంటే టీడీపీని క్షమించరు | Dharmana Prasada Rao Fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేరుద్దాం..

Apr 7 2018 2:09 AM | Updated on Mar 23 2019 9:10 PM

Dharmana Prasada Rao Fires on CM Chandrababu Naidu - Sakshi

ధర్మాన ప్రసాదరావు

సాక్షి, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు టీడీపీ కలిసిరావాలని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన మాట్లాడుతూ.. 2014 లో రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హీమీలు అమలు చేయలేదన్నారు. బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా అధికారం పంచుకుని హామీలను విస్మరించారని ఆయన అన్నారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల తీరును హెచ్చరిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా  పోరాటం చేస్తుంది. ఇటీవల కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఐదుగురు ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలలో వీరోచిత పోరాటం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి . ఆమరణ దీక్షలు  ప్రారంభించారు. ఏడాది క్రితమే మా అధినేత ఈ నిర్ణయాన్ని ప్రకటించాంరని ధర్మాన గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, తన మంత్రి వర్గ సభ్యులు మసిపూసి మారడి కాయ చేస్తున్నారని విమర్శించారు.

అంతేకాక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మేరకు ఎంపీలు రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఆ ఐదుగురు ఎంపీలు ఆంధ్రులకు ప్రతినిధులు అయితే టీడీపీ ఎంపీలు ఈ విషయంలో ముందుకు రావడం లేదన్నారు. సంప్రదింపులకు, మభ్యపెట్టడానికి ఇది సమయం కాదు. రాజీనామాలు చేయటమే మన ముందున్నకర్తవ్యం. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. మొత్తం 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుంది.

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. ఢిల్లీలో రహస్య మంతనాలు తప్ప.. ఏపీ ప్రజల ఆకాంక్షను వివరించలేకపోయారు. ఇంకా అఖిలపక్షాన్ని పిలుస్తామని మభ్యపెట్టడం సరికాదు. చంద్రబాబు అవినీతిపై విచారణ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దోబుచులాటతో కాలయాపన చేయకండి’. అని ధర్మాన టీడీపీపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు పొరపాటును ఒప్పుకుని తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాజీనామాలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని దోషులుగా నిలబెడతారని ఆయన హెచ్చరించారు. మన మందరం కలిసి బీజేపీపై పోరాటం చేద్దామని ధర్మాన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement