ప్రధానికి కేజ్రీవాల్‌ మద్దతు.. పాక్ మంత్రికి కౌంటర్‌

Delhi Assembly Elections 2020 Kejriwal Defends PM Modi Over Pak Minister Tweet - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత్‌ అంతర్గత విషయమని.. ఇందులో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పాక్‌ మంత్రి ఫవాద్‌ ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. కశ్మీర్‌ అంశం, పౌరసత్వ సవరణ చట్టంపై బాహ్య ప్రపంచం నుంచి వస్తున్న విమర్శలు, ఆర్థిక మందగమనం కారణంగా మోదీకి మతి చలించిందని.. అందుకే అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారంటూ ఫవాద్‌ ట్వీట్‌ చేశారు. (ఢిల్లీ అసెంబ్లీ పీఠం: ఈ అంచనాలు నిజమేనా?)

ఈ క్రమంలో ఫవాద్‌ ట్వీట్‌పై స్పందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌... ‘‘ నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి. ఆయన నాకు కూడా ప్రధాన మంత్రే. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత అంశం. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారి జోక్యాన్ని మేము అస్సలు సహించం. భారత ఐకమత్యానికి హాని తలపెట్టాలని పాక్‌ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదు’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కేజ్రీవాల్‌ను విమర్శిస్తున్నా.. ఆయన మాత్రం హుందాగా వ్యవహరిస్తున్నారు’’అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేజ్రీవాల్‌.. భారత్‌, ప్రధానిపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా... 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top