2014లో రిగ్గింగ్‌ జరిగింది!

Cyber expert claims India's 2014 general election rigged - Sakshi

ఈవీఎంలను రిలయన్స్‌ సాయంతో బీజేపీ హ్యాక్‌ చేసింది

సంచలన ఆరోపణలు చేసిన భారతీయ హ్యాకర్‌ షుజా

లండన్‌/న్యూఢిల్లీ: అమెరికాలో తలదాచుకుంటున్న భారతీయ హ్యాకర్‌ ఒకరు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్‌ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్‌ షుజా అనే హ్యాకర్‌ బాంబు పేల్చారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహకరించిందని తెలిపారు. జియో రూపొందించిన మిలటరీ గ్రేడ్‌ లో–ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను తన బృందం అడ్డుకోకుంటే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే విజయం సాధించేదని వెల్లడించారు.

2014 నాటికి జియో తన సేవలను ప్రారంభించకపోవడం గమనార్హం. ఈవీఎంల హ్యాకింగ్‌లో కేవలం బీజేపీనే కాకుండా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌కూ ప్రమేయం ఉందని షూజా ఆరోపించారు. తన బృందంలో కొందరిని హత్య చేయడంతో 2014లోనే తాను భారత్‌ విడిచి పారిపోయానన్నారు. లండన్‌లో సోమవారం స్కైప్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ముసుగు ధరించి షుజా మాట్లాడారు. అయితే తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఆయన చూపలేదు.

లండన్‌ మీడియా సమావేశంలో షుజా మాట్లాడుతూ.. ‘నేను ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లో 2009–14 మధ్య పనిచేశాను. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను నా బృందమే డిజైన్‌ చేసింది. కొత్త ఈవీఎంలను హ్యాక్‌ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్‌ మమ్మల్ని కోరింది. ఈసీఐఎల్, బీఈఎల్‌ రూపొందించే ఈవీఎం లను హ్యాక్‌ చేయగలం. రిలయన్స్‌ జియో అందించిన ఓ మాడ్యులేటర్‌ ద్వారా మిలటరీ గ్రేడ్‌ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్‌ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. 2014 ఎన్నికల తర్వాత నా బృందానికి చెందిన కొందర్ని చంపేశారు. నాపై కూడా దాడి జరిగినప్పటికీ తప్పించుకోగలిగాను’ అని తెలిపారు.

చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: ఈసీ
హ్యాకర్‌ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్‌ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ డిమాండ్‌ చేశారు.

అది హ్యాకింగ్‌ హర్రర్‌ షో: బీజేపీ
లండన్‌లో జరిగిన మీడియా సమావేశాన్ని కాంగ్రెస్‌ నిర్వహించిన ‘హ్యాకింగ్‌ హర్రర్‌ షో’గా బీజేపీ అభివర్ణించింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఆ పార్టీ వెతుక్కుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ఈ కార్యక్రమానికి వెళ్లడం యాదృచ్ఛికం కాదనీ, సోనియా, రాహుల్‌ ఆయన్ను పంపారని దుయ్యబట్టారు. ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరనీ, దేశవ్యతిరేక శక్తులు కాంగ్రెస్‌ పార్టీ బుర్రను హ్యాక్‌ చేశారని చురకలు అంటించారు.  కాంగ్రెస్‌ పార్టీకి పాకిస్తాన్‌లోనూ ప్రాబల్యం ఉందనీ, అలాంటివారు లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంత పెద్దవిషయం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top