జగన్‌ కేసు.. వివరాలు ఎందుకు చెప్పట్లేదు: సీపీఐ

CPI AP President Rama Krishna Slams Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులో కత్తితో దాడి చేస్తే వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారని  సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విలేకరులతో రామకృష్ణ మాట్లాడుతూ..పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అని ఎద్దేవా చేశారు. తల్లీ, చెల్లీ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ నిస్సిగ్గుగా మాట్లాడటం దారుణమన్నారు. మోదీ కంటే సీనియర్‌ని అంటావు..కనీసం జగన్‌కు ఫోన్‌ చేసి పరామర్శించావా అని అడిగారు. పరామర్శించిన వారిది తప్పు అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

చింతమనేని నాలుగేళ్లుగా దాడులు చేస్తూనే ఉన్నారు..ఆయన్ని చంద్రబాబు సమర్దిస్తూనే ఉన్నాడని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక పచ్చ చొక్కాల వారికే ముఖ్యమంత్రివా  అనే అనుమానం కలుగుతోందన్నారు. పచ్చ చొక్కాలకే అయితే మేము నిన్ను ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి చంద్రబాబే కారణమన్నారు. మళ్లీ ఈయన దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమ కరువుపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఏమీ చేయలేదు..ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్‌ ఎక్కడో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఉండే వరవరరావు మోదీని ఎలా చంపుతారో వాళ్లే చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ రాజ్యాంగ సంస్థల్లో జోక్యం చేసుకుంటున్నారని, దాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు కూడా ఇలా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగదేమో..

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగదేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. హాయిలాండ్‌తో మాకు సంబంధం లేదు అనడం అన్యామని చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఒకే పాటు పాడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఆమరణ దీక్ష చేపడుతున్నారు..సీపీఐ వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top