మహారాష్ట్రలో 50:50 ఫార్ములానే!

Congress, NCP, Shiv Sena have to come together to form Maharashtra govt - Sakshi

సమాలోచనల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు 50:50 ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీలకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవితోపాటు చెరో 14 మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్‌కు అయిదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చర్చలు జరిపి, ఆ తరువాత శివసేనతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నాయి.  

సరైన దిశలో చర్చలు సాగుతున్నాయి: ఉద్ధవ్‌
ముంబైలోని ట్రైడెంట్‌ హోటల్‌లో బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు థోరాత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్, మాణిక్‌ రావు సమావేశమయ్యారు. చర్చలు సరైన దిశలో కొనసాగుతున్నాయని మీడియాతో ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు.

‘గడువు తిరస్కరణ’ను ప్రస్తావించని శివసేన
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి మద్దతులేఖను సాధించేందుకు తాము అడిగిన మూడ్రోజుల గడువును గవర్నర్‌ కోష్యారీ తిరస్కరించారనే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో శివసేన ప్రస్తావించలేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా.. ‘మూడ్రోజుల సమయం ఇచ్చేందుకు గవర్నర్‌ ఒప్పుకోని’ అంశాన్ని పిటిషన్‌లో ప్రస్తావించలేదని శివసేన లాయర్లు బుధవారం మీడియాకు చెప్పారు.

గవర్నర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ, వెంటనే దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించాలని శివసేన మంగళవారం సుప్రీంకోర్టు తలుపుతట్టడం, దీనిపై రిట్‌ పిటిషన్‌ దాఖలుచేయాలని శివసేనను కోర్టు ఆదేశించడం తెల్సిందే. అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ చేసిన సిఫార్సును తప్పుబడుతూ తాము మరో పిటిషన్‌ను సిద్ధంచేశామని శివసేన లాయర్లు వెల్లడించారు. అయితే, ఇప్పటికే రాష్ట్రపతిపాలన అమల్లోకి వచ్చినందున, నెమ్మదిగా పిటిషన్‌ వేస్తామని, ఈ పిటిషన్‌ దాఖలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని లాయర్లు చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top