‘ప్రగతి నివేదన’ అట్టర్‌ ఫ్లాప్‌

Congress Leader Ponnam Prabhakar Slams On KCR - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:  టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని, కొండను తవ్వి ఎలుకను తీసిన చందంగా బహిరంగ సభ ఉందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఘాటుగా విమర్శించారు. సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తామని, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కారాలు బీరాలు పలికిన టీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగ సభ పేలవంగా సాగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలకు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బహిరంగ సభ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా తప్ప ఒరిగిందేమి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వారం రోజులుగా చేసిన హంగామా అంతా ఇంతా కాదని, అధికార దర్పంతో, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు లెక్కలేసి జనాన్ని తరలించాలని సూచించిన ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. కొత్త నిర్ణయాలు, జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభ వేదిక నుంచి సీఎం ప్రసంగిస్తారని పదేపదే వల్లేవేసిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ప్రసంగం పేలవంగా సాగడంతో గందరగోళంలో పడ్డారని అన్నారు. తెలంగాణ సాధనకు అమరులైన వారికి, బంధుమిత్ర కుటుంబాలకు వేదిక పైనుంచి ఏమి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అమరులవీరుల స్మారకార్థం నిర్మిస్తామన్న స్మృతి వనం నిర్మించలేదని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి, హైదరాబాద్‌ డల్లాస్, కరీంనగర్‌ లండన్‌ లాంటి హామీలపై మాట్లాడకుండా కమ్యూనిటీ భవనాలు, గొర్రెలు, బర్రెలు, ప్రాజెక్టులపై మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. విద్య, వైద్య రంగాలు నాలుగేళ్లలో మరింత వెనుకబాటుకు గురయ్యాయని, శాతవాహన యూనివర్సిటీకి వీసీని నియమించలేని దుస్థితి నెలకొందని అన్నారు. బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని, ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాక, మరణించాక కుటుంబాన్ని కూడా పరామర్శించలేని కేసీఆర్‌ శవరాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, డాక్టర్‌ సినారెలు మరణించిన సమయంలో వారి స్మారకార్థం నిర్మిస్తామన్న విగ్రహాలు, ఘాట్లు ఏమయ్యాయని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన్‌పల్లి వెంకటరామారావు మరణిస్తే ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్‌కు వచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన సమయంలో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని కేసీఆర్‌ తీరు ఓడ దాటాక ‘ఓడ మల్లన్న రేవు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా ఉందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తుంటే కాంగ్రెస్‌ నేతలకు లాగులు తడుస్తున్నాయని పదే పదే విమర్శించిన టీఆర్‌ఎస్‌ నేతలకు బహిరంగ సభ అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతల లాగులే తడుస్తున్నాయని అన్నారు. ప్రజాసంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో స్టేట్‌ అడ్వయిజరీ కమిటీ వేస్తామన్న పెద్దమనిషి ఇప్పటికీ దాని ఊసెత్తడం లేదని, నిన్నటికి నిన్న పొరుగు రాష్ట్రం పోలీసులు వరవరరావును అరెస్టు చేసి తీసుకెళ్తే కేసీఆర్‌ కనీసంగా మాట్లాడలేదన్నారు.

ఇసుక దందాలో రూ.1900 కోట్ల ఆదాయం వచ్చిందంటున్న ఆయన తెరవెనుక ఆయన సన్నిహితుల జేబుల్లోకి వెళ్లిన రూ.1900 కోట్ల గురించి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దళితుల ప్రాణాలు బలిగొన్న గోల్డ్‌మైన్‌ పేరుతో ఇసుకదందా చేసిన సంతోష్‌రావుకు రాజ్యసభ సభ్యునిగా ప్రమోషన్‌ ఇస్తే ఈ ప్రభుత్వాధినేతను ఏమనాలని ప్రశ్నించారు. గులాబీ వాడిపోయిందని టీఆర్‌ఎస్‌ పార్టీ మాటలు ప్రజలు ఇక నమ్మబోరని, గారడి మాటలు కట్టిపెట్టకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యరావు, ఆకుల ప్రకాష్, చాడగోండ బుచ్చిరెడ్డి, బాశెట్టి కిషన్, కటుకం వెంకటరమణ, బోనాల శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య, శ్రీరాముల కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top