మోదీ పిడికిట్లో ఎమ్మెల్యేలు..!

Congress, JDS Leaders Fire on BJP Horse trading - Sakshi

ఈడీని ఉసిగొల్పి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు

బీజేపీపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతల మండిపాటు

సాక్షి, బెంగళూరు : ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప ప్రమాణం చేశారు. బలనిరూపణకు గవర్నర్‌ యడ్యూరప్పకు 15 రోజులు సమయం ఇచ్చారు. కానీ రేపో-ఎల్లుండో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. మెజారిటీ నిరూపించుకుంటామని సీఎం యడ్యూరప్ప అంటున్నారు. బలపరీక్షలో బీజేపీ గెలువడం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటుండగా.. బీజేపీకి అంతసీన్‌ లేదని, యడ్యూరప్ప ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చట అవుతుందని కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. తమకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, త్వరలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీంతో బలనిరూపణ సందర్భంగా ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరగబోయే బలపరీక్ష చుట్టూ ఆసక్తి నెలకొంది.

                                                      హెచ్‌డీ కుమారస్వామి

బలపరీక్ష, ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారని, ఒక్క ఆనంద్‌సింగ్‌ మాత్రమే ప్రధాని నరేంద్రమోదీ పిడికిలిలో బందీ అయ్యాడని కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ తెలిపారు. విధానసౌధ వద్ద కాంగ్రెస్‌-జేడీఎస్‌ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి జంప్‌ అయిన ముగ్గురు హైదరాబాద్‌ కర్ణాటక ఎమ్మెల్యేల్లో ఆనంద్‌సింగ్‌ ఒకరు. ఆయనతోపాటు నాగేంద్ర, రాజశేఖర పాటిల్‌ బుధవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష భేటీకి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారని, ఒక్క ఆనంద్‌సింగ్‌ మాత్రమే బీజేపీకి ఆకర్షితుడయ్యాడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్‌ అగ్రనేతలు సిద్దరామయయ్య మాట్లాడుతూ.. మొత్తం 118మంది ఎమ్మెల్యేలు (కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలుపుకొని) తమ వద్ద ఉన్నారని, తమకు తగినంత మెజారిటీ లేదనే ప్రచారం తప్పు అని స్పష్టం చేశారు. మరో సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలంతా వందశాతం తమ వెంటే ఉన్నారని, యడ్యూరప్ప ప్రభుత్వం స్వల్పకాలంలోనే కూలిపోతోందని అన్నారు. మెజారిటీ తమకే ఉందని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన తెలిపారు.

                                                          కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌

మా ఎమ్మెల్యేలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు!
ఇక ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో మోదీ ప్రభుత్వ తీరుపై జేడీఎస్‌ నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని విమర్శించారు.  ‘వారు ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీలో నాకు వ్యతిరేకంగా కేసు ఉంది. ఆ కేసును తిరగదోడి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. క్షమించండి.. నా ప్రయోజనాలు నేను కాపాడుకోవాలి’అని ఆనంద్‌ సింగ్‌ చెప్పినట్టు ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాకు చెప్పారు. ఇదీ బీజేపీ నేతల తీరు’ అని కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ బీజేపీ గూటికి చేరినట్టు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top