మోదీ రాకతో బీజేపీ వైపు మొగ్గు

 Congress and BJP have promoting with legendary leaders - Sakshi

మొదట్లో కాంగ్రెస్‌ వైపు కనిపించిన కాస్త అనుకూలత

మోదీ రాకతో మారిన కన్నడ రాజకీయం!

బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధినడి వేసవి ఎండలను కర్ణాటక ఎన్నికలు మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు తమ దిగ్గజ నేతలను ప్రచార రంగంలోకి దింపాయి. వారంతా ఏ ప్రాంతాన్నీ వదలకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప.. కాంగ్రెస్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచార బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా తాజాగా ప్రచార రంగంలోకి దిగారు. అ

యితే, మోదీ ప్రచారం ప్రారంభించడానికి ముందు.. ప్రచారం ప్రారంభించిన తరువాత రాష్ట్రంలో పరిస్థితులు మారినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మోదీ రంగంలోకి దిగకముందు కాంగ్రెస్‌కు కాస్త అనుకూలంగా కనిపించిన వాతావరణం, మోదీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ దిశగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత వెల్లడైన పలు సర్వేలు కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లు సాధించలేకపోయినా.. అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే, పరిస్థితి ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉందని, ఆ పార్టీనే అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చని పేర్కొంటున్నారు.

మోదీ హవా: నెల క్రితం కొన్ని ఏజెన్సీలు సర్వేలు నిర్వహించాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకమైన ఫలితాల్ని అంచనావేశాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో హంగ్‌ తప్పదని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో 41 శాతం ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే, బీజేపీ పక్షాన 33 శాతం, జేడీఎస్‌ వైపు 23 శాతం, తక్కిన 3 శాతం మంది ఇతరుల వైపు నిలిచినట్లు లెక్కలు చూపాయి. కాంగ్రెస్‌ 95–100, బీజేపీ 75–85, జేడీఎస్‌ 35–41 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేల్చాయి. అయితే, వారం రోజుల క్రితం మోదీ తన రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13 ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరో 8 ర్యాలీల్లో పాల్గొననున్నారు.

పాల్గొన్న ప్రతీ సభలోను కాంగ్రెస్‌పై, ఆ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై.. తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.  వక్కలిగ ఓట్ల కోసం జేడీఎస్‌ అధినేత దేవెగౌడపై ప్రశంసలు గుప్పించారు. మోదీ ప్రసంగాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.అలాగే, ఇప్పటికే అమిత్‌ షా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేశారు. మరోవైపు, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రసంగాల్లో మోదీపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. మోదీ తాజా ప్రచార సభల అనంతరం రాష్ట్రంలో మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తోందని, బీజేపీ స్థాయిలో కాంగ్రెస్‌ ఆకట్టుకోలేకపోతోందని భావిస్తున్నారు. మోదీ సంధిస్తున్న విమర్శనాస్త్రాలకు రాహుల్‌ దీటుగా స్పందించలేక పోతున్నారంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ కంటే సిద్ధరామయ్యే ‘స్టార్‌ క్యాంపెయినర్‌’ అని కొందరు కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

2014 ఎన్నికల్లో..
2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారాన్ని దక్కించుకుంది. అయితే, 2014 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ప్రచారానికి మోదీ వచ్చారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌కు పట్టం కట్టిన కన్నడ ఓటర్లు 2014లో 28 ఎంపీ స్థానాల్లో 17 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్‌ 9, జేడీఎస్‌ 2 సీట్లు మాత్రమే గెలిచాయి. దక్షిణాదిలో బీజేపీ గెలిచిన 21 స్థానాల్లో.. 17 కర్ణాటకలోవే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top