ఒక సీటు..ఇద్దరు పోటీ

Confusion In JDS Party Karnataka Elections - Sakshi

జేడీఎస్‌లో గందరగోళం

బీఫారంతో పాటు సీఫారం అందజేత  

10 నియోజకవర్గాల్లో కటకట

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రక్రియలో ఓ ఘట్టం ముగిసింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాష్ట్రంలో ఫలితాలపై కీలక ప్రభావం చూపనున్న జేడీఎస్‌లో గందరగోళం నెలకొంది. నామినేషన్ల పర్వంలో భాగంగా టికెట్ల కేటాయింపు చివరిరోజు వరకు పెండింగ్‌లో ఉంచడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. హైదరాబాద్‌ కర్ణాటక, ముంబయి కర్ణాటక ప్రాంతాల్లోని పలు స్థానాల్లో ఇద్దరు చొప్పున జేడీఎస్‌ బీఫారం, సీఫారాలతో నామినేషన్‌ వేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు.

చివరిరోజు హడావుడి
జేడీఎస్‌ 126 మంది అభ్యర్థులతో ఫిబ్రవరిలోనే తొలిజాబితా విడుదల చేసింది. తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలకు రెండోజాబితాలో టికెట్లు ఇచ్చింది. కానీ నామినేషన్ల సమర్పణకు చివరిరోజైన మంగళవారం కూడా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. ఈ హడావుడిలో కొందరికి బీ ఫారం ఇచ్చి అదేస్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లుగా కొందరికి సీ ఫారం అందజేశారు. సుమారు 10 నియోజకవర్గాల విషయంలో ఇలా జరిగింది. అయితేబీ, సీ ఫారాలు పొందిన ఇద్దరూ నామినేషన్లు వేయడంతో ఒకేచోట ఇద్దరు పోటీ పడినట్లు అయ్యింది. పార్టీ అధిష్టానం మాత్రం బీఫారం రద్దు చేస్తూ సీఫారం అందజేసినట్టు తెలిపింది. కేఆర్‌ పేట ఎమ్మెల్యే నారాయణగౌడకు పార్టీ టికెట్‌ తిరస్కరించింది. ఆ స్థానంలో బీఎల్‌ దేవరాజ్‌ సి ఫారం అందుకుని చివరి నిమిషంలో నామినేషన్‌ సమర్పించారు. దేవనహళ్లి స్థానానికి కూడా అధిష్టానం కొత్త అభ్యర్థికి సీ ఫారం అందజేసింది. అక్కడ ఉన్న పిళ్లమునిశామప్ప టికెట్‌ను రద్దు చేస్తూ ఆ స్థానంలో నిసర్గ నారాయణస్వామిని బరిలో దింపింది. శిడ్లఘట్ట అభ్యర్థిపై కూడా గందరగోళం నెలకొంది. రవికుమార్, రాజన్నలు నామినేషన్‌ వేశారు.

27న సర్దుబాటు చేస్తారా
ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఈ నేపథ్యంలో ఒకే స్థానంలో పోటీ చేస్తున్న ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకునేలా అధిష్టానం బుజ్జగింపులు చేపడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఎవరున్నారనేది స్పష్టమవుతుందని పార్టీ పెద్దలు తెలిపారు.

అంతా సర్దుకుంటుంది: దేవేగౌడ
 పార్టీలో చోటు చేసుకున్న అసమ్మతి సర్దుకుంటుందని మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ జాన్‌ బోనర్‌ దేవేగౌడతో బుధవారం బెంగళూరులో సమావేశమయ్యారు. అనంతరం దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు ఉన్నమాట వాస్తవమే. కానీ త్వరలోనే అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికలో కాస్త గందరగోళమైందన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్లు వైఫల్యంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. మోదీ ఏదో చేయాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. జాన్‌బోనర్‌ మాట్లాడుతూ తాను దేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించానన్నారు. అయితే దేవేగౌడ పాలనలో దేశం, జేడీఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచాయని తెలిసినట్టు చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top