రోజూ ఇదే రాద్ధాంతం | CM YS Jagan Mohan Reddy fires over TDP actions | Sakshi
Sakshi News home page

రోజూ ఇదే రాద్ధాంతం

Jul 25 2019 4:31 AM | Updated on Jul 25 2019 8:29 AM

CM YS Jagan Mohan Reddy fires over TDP actions - Sakshi

అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : రైతన్నకు వచ్చే ఏడాది మేలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 15కే ఇవ్వాలని నిర్ణయించామని, ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సిన తెలుగుదేశం పార్టీ దీన్ని కూడా వక్రీకరించేందుకు, అబద్ధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడం దారుణమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి విషయాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుకు పెట్టుబడి సాయంపై శాసనసభలో బుధవారం టీడీపీ పక్ష సభ్యుడు సత్యప్రసాద్‌ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. అయినప్పటికీ టీడీపీ సభ్యుడు ప్రభుత్వ లక్ష్యాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేశారు. వాస్తవాలను మాటలతో వక్రీకరించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకున్నారు. టీడీపీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..

రోజూ ఇదే తంతా?
‘తొమ్మిది గంటలకు మొదలైన సభ పది గంటలు దాటినా నాల్గవ ప్రశ్న కూడా పూర్తికాని పరిస్థితి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్న వేశారు. దానికి మంత్రులు సమాధానమిచ్చారు. అంతటితో సమాధానమొచ్చినట్టే, విషయం ముగిసినట్టే. కానీ మళ్లీ మీరు (స్పీకర్‌) సత్యప్రసాద్‌కు పెద్దమనసుతో అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు లేచి నేను మాట్లాడతా.. నేను మాట్లాడతా.. అన్నారు. ప్రతి రోజూ ఇది జరుగుతూనే ఉంది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అదే నిజమవుతుందనుకుంటారు. అందుకే అబద్ధాన్ని నిజం చేయడానికి శాసనసభలో ఓ పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నారు.  

మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట అమలు చేస్తున్నాం
ఇది మా మేనిఫెస్టో (చూపిస్తూ). రెండే రెండు పేజీలు. ఇందులో చెప్పిన ప్రతి అంశాన్నీ ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తున్నాం. అలా భావిస్తున్నాం కాబట్టే ఇదే మేనిఫెస్టో ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి అధికారి దగ్గర ఉంది. మా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే అందుబాటులో ఉంది. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర ఈ మేనిఫెస్టో అందుబాటులో ఉంది. ఇందులో పొందుపరిచిన ప్రతి మాట, ప్రతి లైన్‌ తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం. ఈ మేనిఫెస్టోను చూపించే ప్రజలను ఓట్లడిగాం. వాళ్లు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఇందులో పేర్కొన్న ప్రతి అంశం అమలు చేస్తున్నామని, వీళ్లకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని టీడీపీ వాళ్లు ఈర్ష్య, దుగ్దతో, ఆక్రోశం తట్టుకోలేక, ఇందులోని ప్రతి అంశాన్ని అబద్ధంగా చెబుతున్నారు. మేనిఫెస్టోలో స్పష్టంగా ఉన్నా కూడా, లేదని వీళ్లంతట వీళ్లు అనుకుని అబద్ధం చెప్పడం, వాళ్లే మాట్లాడటం, వక్రీకరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. 

మేనిఫెస్టోలో మేం చెప్పింది ఇదీ..
ఇందులో (మేనిఫెస్టో చదువుతూ) ఉన్నదేంటి? ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలోనే రూ.12,500 ఇస్తామని ఇంత క్లియర్‌గా రాశాం. దానర్థమేంటి? నాలుగు దఫాలుగా ఇస్తామనేగా. మే 30వ తారీఖున మేం అధికారంలోకి వచ్చాం. అంటే మేం ఇవ్వాల్సింది వచ్చే ఏడాది మే నెలలో ఇవ్వాలి. అలాంటిది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, దాన్ని అడ్వాన్స్‌ చేసి, రబీలో సాయం అందుబాటులోకి తేవాలని.. అక్టోబర్‌ 15న ఇవ్వాలని అన్ని విధాల సన్నాహాలు చేస్తున్నాం. దీన్ని బడ్జెట్‌లోనూ పెట్టాం. మనసా, వాచా, కర్మణ మేనిఫెస్టోలోని ప్రతి లైన్‌కు కట్టుబడి పని చేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకుని మంచి మనసుతో అభినందించాల్సింది పోయి.. వక్రీకరిస్తూ, అబద్ధాలు, మోసాలతో సభను తప్పుదారి పట్టించే కార్యక్రమం ప్రతీ రోజూ జరుగుతూనే ఉంది. నిన్న, మొన్న, ఈ రోజు ఇదే పని. ఇక్కడ చర్చ జరగాలని, సభ ద్వారా ప్రజలకు మంచి జరగాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఎంతసేపూ వక్రీకరించాలి.. ఎలా మోసం చెయ్యాలి.. సత్యదూరమైన మాటలు ఎలా చెప్పాలనే దిక్కుమాలిన ఆలోచనలు తప్ప వేరేవి లేవు. దయచేసి ఇంతటితో ఈ విధానం ఆపేయండి. మళ్లీ మళ్లీ మైక్‌ ఇచ్చుకుంటూ పోతే ఎక్కడికి పోతుందో తెలియదు. ప్రశోత్తరాల సమయం పూర్తి చేసేందుకు ముందడుగు వేయాలి’ అని సీఎం జగన్‌ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement