మోదీ చోర్‌!

CM Chandrababu comments on Narendra Modi - Sakshi

దేశం మొత్తం అదే మాట

పశ్చిమగోదావరి జన్మభూమి సభలో చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/మెట్రో/సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీని దేశం మొత్తం చోర్‌ (దొంగ) అని అంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఫెల్‌ కుంభకోణంలో రూ.43వేల కోట్లు కొల్లగొట్టి తన స్నేహితునికి మోదీ అప్పగించారని ఆరోపించారు. ఆయన పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, బ్యాంకులు లూటీ అయ్యాయనీ, వాటిని దోపిడీ చేసిన వారు విదేశాలకు పారిపోయారన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించే వారిపై ఆయన అక్రమంగా కేసులు బనాయించేందుకు సీబీఐని ప్రయోగిస్తున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. యూపీలో అఖిలేష్‌ యాదవ్, మాయావతి పొత్తు పెట్టుకుంటే అఖిలేష్‌పై కేంద్రం సీబీఐ కేసులు పెట్టిందన్నారు. అనుకూలంగా ఉన్నందుకే కేసీఆర్‌పై కేసును తప్పించారని, అదే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపైనా కేసులు తప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో నీతివంతమైన పాలన అందించేందుకు కాంగ్రెస్‌తో జతకట్టామని ముఖ్యమంత్రి చెప్పారు.  

ప్రధానికి ఆ అర్హతలేదు
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని మోదీ అంటున్నారనీ, ఆయన గురించి మాట్లాడే అర్హత ప్రధానికి లేదని చంద్రబాబు చెప్పారు. తాను ప్రధాని పదవి కోసం కలలు కంటున్నానని అనడంలో వాస్తవంలేదనీ, రెండుసార్లు ప్రధాని పదవి కోసం అవకాశం వచ్చినా వదులుకున్న ఘనత తనదన్నారు. తన కుమారుడు లోకేష్‌ అభివృద్ధి కోసం తాను పాటుపడుతున్నట్లు అంటున్నారనీ, కానీ.. తాత ఆశయాలు నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వస్తానని లోకేష్‌ చెప్పాడని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేందుకే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు సీఎం చెప్పారు. కేంద్రం, వైఎస్సార్‌సీపీ కలిసి రాష్ట్ర హక్కులు కాలరాసే విధంగా ఎన్‌ఐఏను తీసుకొచ్చారన్నారు.

‘పోలవరం’లో గిన్నీస్‌ రికార్డు: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల్లో నవయుగ సంస్థ గిన్నిస్‌ రికార్డును సాధించింది. 2019 జనవరి 6న చేపట్టిన కాంక్రీట్‌ పనులకు సంబంధించి 24 గంటల్లో 32,315.5 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ఇంజినీర్లు డబుల్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గిన్నిస్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 2019లో గ్రావిటీ ద్వారా నీరు అందించి తీరతామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా రామయ్యపేటలో పైలాన్‌ ఆవిష్కరించారు.

సీఎంతో టోనీ బ్లెయిర్‌ భేటీ
ఇదిలా ఉంటే.. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయానికి సోమవారం రాత్రి వచ్చిన బ్లెయిర్‌ను సీఎం ఆర్టీజీ సెంటర్‌కు తీసుకెళ్లి దాని గురించి వివరించారు. టోనీకి తనకు మధ్య ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉందని చంద్రబాబు చెప్పారు. అనంతరం బ్లెయిర్‌ను సన్మానించారు. ఆ తర్వాత సచివాలయంలోనే టోనీకి సీఎం ఆతిథ్యమిచ్చారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top