నేనిస్తున్న నీళ్లు తాగుతూ నాపై విమర్శలా?

CM Chadrababu Naidu Fires On  - Sakshi

సాక్షి, పోలవరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తాను ఇచ్చిన నీళ్లు తాగుతూ తననే విమర్శిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... కుప్పం కంటే పులివెందులకే ముందుగా నీళ్లు ఇచ్చామని, అయితే తాను ఇచ్చిన నీళ్లను తాగుతూ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. పనిలో పనిగా సాక్షి దినపత్రికపై కూడా చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆ పత్రిక విషం చిమ్ముతుందంటూ వ్యాఖ్యానించారు.

దేశంలోనే అరుదైన ప్రాజెక్ట్‌ పోలవరం అని, జూన్‌ నాటికి కాపర్‌ డ్యామ్‌ను పూర్తి చేస్తామన్నారు. పోలవరానికి అదనంగా 9200 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామన్నారు. ఇప్పటికే 5500 కోట్లు ఇచ్చారని, ఇంకా 2900 కోట్ల రూపాయిలు కేంద్రం నుంచి రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని, పోలవరం అడ్డుకోవాలని కోర్టులకు వెళ్తున్నారని అన్నారు. తన కష్టానికి సమాధానం అయిదుకోట్ల మంది ప్రజలే చెప్పాలన్నారు. 

ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లు ఓపిక పట్టానని అన్నారు.  ఈ నాలుగేళ్లు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించానని, ఇపుడు దండోపాయంలోకి దిగానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వీళ్లందరూ రాజకీయాలలో తనకంటే జూనియర్స్ అని అన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని.. వెంకన్నకు సమాధానమ చెప్పాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఈ నెల 30 తిరుపతిలో బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top