జిల్లాకు కీలక పదవులు

Chittoor Two Ministers Elected To Get AP Cabinet - Sakshi

ఇద్దరు సీఎంలను ఎదిరించి నిలిచిన పెద్దాయన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు కల్పించి కీలకమైన శాఖలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులు, ఎక్సైజ్, కమర్షియల్‌ టాక్స్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి     పదవులను కట్టబెట్టి జిల్లా అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. జిల్లాకు పెద్ద దిక్కుగా చెప్పుకునే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దిరెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖలను అప్పగించారు. కళత్తూరు నారాయణస్వామిని డెప్యూటీ సీఎం చేయడంతో పాటు     ఎక్సైజ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖలను అప్పజెప్పారు. 

సాక్షి, తిరుపతి : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి... రాజకీయ ఉద్ధండుడయ్యారు. రాజకీయ నాయకులతో పాటు... ప్రజలు కూడా పెద్దాయన అని పిలుస్తుం టారు. విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగిన ఆయన ఎంఏ పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1975లో విద్యార్థి సంఘం చైర్మన్‌గా విజయం సాధించారు. నీలం సంజీవరెడ్డి ప్రోత్సాహంతో 1978లో పీలేరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1999, 1999, 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెద్దిరెడ్డి 2019లో పుంగనూ రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎన్‌.అనీషారెడ్డిపై 43,555 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో తొలుత మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా విశేష సేవలందించారు.

అటవీశాఖతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్‌ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా చాకచక్యంగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌  స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం చేసుకున్నారు. జిల్లాకు చెందిన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోయినా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. వారిద్దరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా... భయపడకుండా వారి ప్రజావ్యతిరేకపాలనపై పోరాడారు.  కార్యకర్తలకు అండగా ఉంటూ... కష్టాలు, నష్టాలకు ఓర్చి అన్నీ తానై వ్యవహరించారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో పెద్దిరెడ్డి తోపాటు ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.
 
కేంద్ర రాజకీయాల్లోనూ...

పెద్దిరెడ్డి రాజకీయ నాయకులతోనే కాకుండా ప్రజలతో మంచి సంబంధాలు నెరపుతారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలపై వెంటనే స్పంది స్తుం టారు. పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి ట్రస్ట్‌ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర స్థాయిలోనూ రాజకీయాలు నెరిపిన నేతగా పేరుంది. ప్రస్తుతం కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా ఘన విజయం సాధించి లోక్‌సభ పక్ష నేతగా ఎంపికయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా భారీ విజయం సొంతం చేసుకున్నారు. 

సుదీర్ఘ రాజకీయ నాయకుడు నారాయణస్వామి

వైఎస్‌ జగన్‌ తొలి మంత్రివర్గంలో మరో మంత్రి కళత్తూరు నారాయణస్వామి సుదీర్ఘ  రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. నారాయణస్వామి  స్వగ్రామం  కార్వేటినగరం మండలం పాదిరికుప్పం. బీఎస్సీ వరకు చదువుకున్నారు. జిల్లా అంబేడ్కర్‌ యువజన సంఘం  కార్యదర్శిగా కొనసాగారు. 1981లో కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే కార్వేటినగరం సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1987లో కార్వేటినగరం ఎంపీపీగా ఎన్నికయ్యారు. పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్‌ హయాంలో 2004లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి  తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ దివంగతులయ్యాక కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అడహక్‌ కమిటీ కన్వీనర్‌గా, గంగాధరనెల్లూరు నియోజకవర్గ  సమస్వయకర్తగా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ  జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా రు. 2014, 2019  ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. సర్పంచ్‌ స్థాయి నుంచి ఎదిగి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నారాయణస్వామికి ప్రత్యేకించి దళిత సామాజికవరా>్గనికి అవకాశం కల్పించా లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణస్వామికి డెప్యూటీ సీఎంతో పాటు.. ఎక్సైజ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖలు అప్పగించారు.

సత్యవేడుకు ‘కళ’త్తూరు మార్క్‌ 
సత్యవేడు నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత ఒక్కసారిగా అభివృద్ధి జరిగింది నారాయణస్వామి హయాం లోనే. 1961లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే సాగింది. 2004లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో 2004–2009 మధ్య కాలంలో నారాయణస్వామి ఆ నియోజవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్‌ ప్రోత్సాహం, నారాయణస్వామి కృషితో అప్పట్లోనే ఆ నియోజకవర్గ పరిధిలో శ్రీసిటీ ఏర్పాటైంది. దేశ, విదేశ పరిశ్రమలు వందలాదిగా ఏర్పాటు కావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. విద్యాభివృద్ధికి డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలు మంజూరయ్యాయి. రైతాంగం కోసం నాగలాపురం మండలంలో భూపతేశ్వరకోన ప్రాజెక్టు, ఉబ్బలమడుగు సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. తెలగుగంగ ప్రధాన కాలువ నుంచి రూ. 100 కోట్ల నిధులతో ఉపకాలువలు తవ్వించి 17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేశారు.  సత్యవేడు ఎమ్మెల్యేగా నారాయణస్వామి ఉన్న ఆ ఐదేళ్లలో తప్ప... అంతకుమునుపుగానీ ఆ తరువాతగానీ అంతటి అభివృద్ధి జరగలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top