వివేక్‌పై ఎమ్మెల్యేల రుసరుస!

Changing politics In thePeddapalli Lok Sabha constituency - Sakshi

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మారుతున్న రాజకీయం

తమను ఓడించేందుకు పనిచేశారని ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రాజకీయం రంగులు మారుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ భారీ తేడాతో ఓటమి పాలుకాగా, ధర్మపురిలో సీనియర్‌ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్‌ అతి కష్టంగా విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఇలాంటి ఫలితాలు రావడానికి ‘బలమైన’ శక్తులు పనిచేశాయని ఓడిన ఇద్దరితోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ జి.వివేక్‌ లోక్‌సభ పరిధిలో ఫలితాలను శాసించేందుకు యత్నించారని వారు భావిస్తున్నారు. 

భగ్గుమంటున్న పార్టీ శ్రేణులు
ఇటీవల దర్మపురి నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వివేక్‌పై బాహాటంగానే విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను ఓడించేందుకు వివేక్‌ వర్గీయులు రూ.3 కోట్లు ఖర్చు చేశారని, వివేక్‌ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని వారి ఆరోపణ. బెల్లంపల్లి నుంచి తన సోదరుడు వినోద్‌ను బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దింపి, తమ నేతను ఓడించేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేశారని చిన్నయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. చెన్నూరులో వివేక్‌ ఆఖరులో మాత్రమే ప్రచారానికి వచ్చారని బాల్క సుమన్‌ అనుచరులు గుర్తు చేస్తున్నారు.

రామగుండంలో రెబెల్‌గా పోటీ చేసిన కోరుకంటి చందర్‌కు వివేక్‌ వర్గీయులు మద్ధతుగా నిలిచినట్లు సోమారపు అనుచరుల ఆరోపణ. వివేక్‌ కారణంగా భారీ మెజారిటీ కోల్పోయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అనుచరులు చెబుతున్నారు. మంథనిలో పుట్టా మధు కోసం వివేక్‌ ప్రచారం చేసినా, ఫలితమివ్వలేదు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఐదు సెగ్మెంట్లలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరు ల్లో వివేక్‌ పట్ల అసంతృప్తి పెల్లుబుకుతోంది. దీంతో పెద్దపల్లి ఎంపీ సీటుపై సందిగ్ధం నెలకొంది. వివేక్‌కు లోక్‌సభ సీటిస్తే ఒప్పుకునేది లేదని సగానికి పైగా ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top