టీడీపీ కార్యాలయం @ప్రజావేదిక

Chandrababu Naidu Use Praja Vedika As TDP Office - Sakshi

రూ.4.34 కోట్లతో నిర్మించిన సీఆర్‌డీఏ 

యథేచ్ఛగా వాడుకుంటున్న బాబు

పార్టీ సమీక్షలు, చేరికలు, మేనిఫెస్టో కమిటీ 

సమావేశాలు సైతం అక్కడే

ఎన్నికల కోడ్‌ను ఏమాత్రం పట్టించుకోని వైనం

సాక్షి, అమరావతి: నీతి నియమాలు, ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ గురించి నిత్యం శ్రీరంగనీతులు చెప్పే  చంద్రబాబు ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా తుంగలో తొక్కి తన మాటలు, చేతలకు పొంతన ఉండదని ప్రజావేదిక సాక్షిగా మరోసారి నిరూపించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సిన తన అధికారిక నివాసం, దాని పక్కనే ఉన్న ప్రజా వేదికను పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా మార్చివేశారు. సాక్షాత్తూ సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తే అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నియమావళి ప్రకారం సీఎం, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. కృష్ణా నది కరకట్టపై తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు.

మూడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం దాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తించింది. సీఎంని కలిసేందుకు వచ్చే ప్రజల కోసమంటూ సీఆర్‌డీఏ 2017 ఏప్రిల్‌లో ప్రజావేదిక (గ్రీవెన్స్‌ సెల్‌)ను నిర్మించింది. రూ.4.34 కోట్లతో ఎన్‌సీసీ ఈ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ప్రజావేదికను మొదటి నుంచి చంద్రబాబు పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత కూడా దాన్ని, తన ఇంటిని ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలా మార్చివేశారు. విశాఖ, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ప్రజావేదికలో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఎన్నికలకు వారిని సమాయత్తం చేసే ప్రసంగం ఇచ్చారు. మూడు రోజుల క్రితం చింతలపూడికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు పార్టీలో చేరే కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించి వారితో మాట్లాడించడమే కాకుండా తానూ మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ తయారు చేసిన పది ప్రచార రథాలను ప్రజావేదిక ప్రాంగణంలోనే ఉంచి అక్కడి నుంచే వాటిని ప్రారంభించారు. సుజనాచౌదరి, యనమల, పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసే టీడీ జనార్థన్, వీవీవీ చౌదరి వంటి వారంతా ప్రజా వేదికలోనే అసమ్మతి నేతలు, వర్గాలతో బుజ్జగింపులు, సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు నేతలు టీడీపీలో చేరే కార్యక్రమాన్ని ప్రజావేదికలో నిర్వహించారు.

మరోవైపు చంద్రబాబు ప్రతిరోజూ లక్షన్నర మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలా పనిచేయాలో నిర్దేశిస్తున్నారు. అంతమందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ప్రభుత్వం ఆధీనంలోని కమ్యూనికేషన్‌ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ వ్యవస్థ అంతా ఆర్టీజీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. దాన్ని కూడా దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన పలు వ్యవస్థలను చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు ఇష్టానుసారం వాడుకుంటున్నారు. కోడ్‌ అమల్లో ఉండగా అధికారులతో సమీక్ష చేయకూడదని తెలిసినా వారితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top