రాజకీయాల్లో ఎవరు త్యాగం చేయరు..

Chandrababu Naidu Take A U-Turn Over His Political Future, says BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో ఎవరు త్యాగం చేయరని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్‌ నరసింహారావు శనివారం ‘సాక్షి’ తో మాట్లాడుతూ..‘2010 ఎన్నికల్లో పొత్తు కోసం వెంపర్లాడింది ఎవరో అందరికీ తెలుసు. నరేంద్ర మోదీ హవా చూసి పొత్తుకు చం‍ద్రబాబు ఉత్సాహం చూపించారు. తప్పని పరిస్థితుల్లోనే బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. రాజకీయా కారణాలతోనే ఎన్డీయే నుంచి చంద్రబాబు తప్పుకున్నారు. ఎన్డీయే నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబుకు మేం చెప్పలేదు.

నిన్న, మొన్నటి వరకూ ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు రాజకీయ వ్యూహాత్మకంగా ఉండటానికే ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్నారు. దురుద్దేశంతోనే ఎన్డీయేపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నప్పుడు ఏదైతేనేమీ అన్న ఆయన ఇప్పడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాజకీయంగా ఒత్తిడికి గురయ్యే ఎన్డీయే నుంచి వైదొలిగారు. కేంద్ర మంత్రులతో మంచి పరిచయాలతో నాలుగేళ్లు ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా దేని కోసం పనిచేశారు?. ఢిల్లీకి 29సార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా దేని కోసం వచ్చారు?. దేశవ్యాప్తంగా 25 లక్షల ఇళ్లు ఇస్తే.. అందులో ఏపీకే 8 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు కల్పించాం. చట్టంలో లేని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేకపోయినా..చాలా అంశాల్లో ఏపీకి సహకరించాం.

కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వమని చెప్పలేదు. పరిశీలనలో ఉన్నాయని మాత్రమే చెప్పాం. విభజన చట్టంలోని 80శాతం అంశాలను అమలు చేశాం. నాలుగేళ్లుగా కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి హఠాత్తుగా చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయ అవసరాల కోసం అసెంబ్లీ సీట్లను పెంచాలనడం సరికాదు. అది ప్రజలపై భారం పడుతుంది. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఫిరాయింపులు జరిగాయి. వాళ్ల అవసరాల కోసమే అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరుతున్నారు. ఎవరి మద్దతు లేకుండానే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతాం.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాం. దానికి సంబంధించిన 80 శాతం నిధులను రాష్ట్రానికి ఇచ్చాం. సరైన వివరణ ఇవ్వకుండానే ప్రాజెక్ట్‌ అంచనాలను భారీగా పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పకుండా నిధులు అడిగింది. కేంద్రం, రాష్ట్రాం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రాజెక్ట్‌ ఖర్చులను చెప్పాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఎన్నికల్లో గెలిచే సత్తా బీజేపీకి ఉంది. ఓటుకు కోట్లు కేసు కోర్టు పరిధిలో ఉంది. దానిపై పొలిటికల్‌ కామెంట్‌ చేయను.

అవసరాల కోసం ఏర్పడే ఫ్రంట్‌లను ప్రజలు సమర్థించరు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌పై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. వాటిపై స్పందించాల్సినంత సమాచారం నా దగ్గర లేదు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉంది.నాలుగేళ్లు పాలించినా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాననే దౌర‍్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ప్రధాన కార్యాలయానికి విజయసాయి రెడ్డి వెళ్లడంలో తప్పేముంది. ఎవరైనా ప్రధాని కార్యాలయానికి వెళ్లొచ్చు.’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top