గూడు జాడ లేదు | Chandrababu Naidu Government Works In Pending Of NTR Gruhakalpa Scheme In Anantapur | Sakshi
Sakshi News home page

గూడు జాడ లేదు

Published Mon, Apr 1 2019 9:44 AM | Last Updated on Mon, Apr 1 2019 9:44 AM

Chandrababu Naidu Government Works In Pending Of NTR Gruhakalpa Scheme In Anantapur - Sakshi

కూడు.. గూడు.. గుడ్డ.. ప్రతి మనిషికీ కనీస అవసరాలు. కానీ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో తలదాచుకునేందుకు కాసింత నీడలేక ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌ హయాంలో అడిగిన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించగా...టీడీపీ సర్కార్‌ మాత్రం జనం గూడు గోడు పట్టించుకోలేదు. అందరికీ ఇళ్లంటూ ప్రచారం హోరెత్తించి...లబ్ధిదారుల వాటా కింద డబ్బు వసూలు చేసి... ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించలేదు. ఐదేళ్లూ హామీలతోనే కాలం గడిపేసింది. ఒక్క ఇంటినీ పూర్తి చేయకపోవడంతో వేలమంది నిరుపేదలు అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి డీడీ కట్టినా తమకెందుకీ అవస్థలని ప్రశ్నిస్తున్నారు.   

రూ.500 డీడీలు తీసిన వారు    : 2,640 (ఫస్ట్‌ కేటగిరీ)  
రూ.12,500 డీడీలు తీసినవారు  : 1,240 (సెకండ్‌ కేటగిరీ) 
రూ.25,000 డీడీలు తీసినవారు :1,248 (మూడో కేటగిరీ)  

ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు 
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పథకానికి బ్రేక్‌ పడింది. జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎక్కడి పనులు అక్కడే∙ఆగిపోయాయి. నిర్మాణ పనులు చేపట్టిన షాపూర్‌పల్లోంజీ కంపెనీకి ప్రభుత్వం రూ.వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో నెల రోజులుగా పనులు ఆగిపోయాయి. ఫలితంగా  61,556 ఇళ్ల నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సొంతింటిపై ఆశతో పైసా, పైసా కూడబెట్టిన మొత్తంతో పాటు, అప్పులు చేసి తమ వాటా కింద డీడీలు కట్టిన నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

మూడు కేటగిరీల్లో అర్బన్‌ హౌసింగ్‌ 
2017లో కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనను ప్రవేశపెట్టింది. ఏపీ ప్రభుత్వం పీఎంఏవై, ఎన్టీఆర్‌ నగర్‌ పేరిట పథకాన్ని ప్రారంభించింది. మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి కేటగిరీలో 300 చదరపు అడుగుల ఇల్లు, రెండో కేటగిరిలో 365 చదరపు అడుగులు, మూడో కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లను నిర్మిస్తారు. అన్ని కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు సబ్సిడీ అందజేస్తుంది. మిగతా మొత్తం బ్యాంకు ద్వారా రుణం తీసుకోవడంతో పాటు లబ్ధిదారుడు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.  

రూ.వెయ్యి కోట్ల బకాయి 
జిల్లాలోని వివిధ మున్సిపాలిటీ, నగరపాలక సంస్థకు సంబంధించి రూ.2,400 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతకు సంబంధించే కాంట్రాక్ట్‌ కంపెనీకి రూ.వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్‌ సంస్థ పనులు అర్ధాంతరంగా ఆపేసినట్లు సమాచారం. బకాయిలు చెల్లించాకే పనులు మొదలుపెడుతామని కంపెనీ నిర్వాహకులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. టీడీపీ పాలన ఐదేళ్లు పూర్తయి ఎన్నికూడా రావడంతో.. పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కన్పించడం లేదు.  

61,556 ఇళ్లకు బ్రేక్‌  
జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థకు మంజూరైన 61,556 ఇళ్లకు బ్రేక్‌ పడింది. వాస్తవంగా కేంద్రం మొదటి రెండు దశల్లో తాడిపత్రికి 3,009 (రూ.165 కోట్లు), గుత్తికి 398, పామిడి 2,599, కళ్యాణదుర్గం 1,393, ధర్మవరం 8,832, కదిరి 3,762, పుట్టపర్తి 1,243, హిందూపురానికి 2,750 ఇళ్లను మంజూరు చేశారు. మూడో దశలో అనంతపురం నగరపాలక సంస్థకు 6,017, రాయదుర్గానికి 1,791, తాడిపత్రికి 3,520, గుంతకల్లు 4719, హిందూపురం 10,781, అహుడా పరిధిలో 4,379 ఇళ్లు మంజూరు చేశారు. అనంతపురం నగరపాలక సంస్థకు నాల్గో దశలో 6,263 ఇళ్లను మంజూరు చేశారు.  

అప్పు చేసి రూ.50 వేలు డీడీలు కట్టా..
నాకు అఫోర్టబుల్‌ హౌసింగ్‌(ఏహెచ్‌పీ) కింద ఇల్లు మంజూరైంది. క్యాటగిరీ–3 కింద 430 చదరపు అడుగుల గల ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుని వాటా రూ.లక్ష కాగా... నాలుగు విడతల్లో చెల్లించాలని చెప్పారు. నేను ఇప్పటికి అప్పు చేసి రెండు కంతులు రూ.50 వేలు చెల్లించా. బ్యాంకు రుణానికి డాక్యుమెంటేషన్‌ చేయించా. ఇంకా గృహ నిర్మాణం పూర్తి కాలేదు. ఇపుడేమో ఎన్నికలొచ్చాయి. అద్దె ఇంటి కష్టాలు ఇంకా ఎన్నేళ్లు పడాలో.. అర్థం కావడం లేదు.

పీఎస్‌ రవిరాజు, ఏహెచ్‌పీ లబ్ధిదారుడు, పామిడి 

మభ్యపెట్టి మోసం చేశారు
పక్కా గృహ నిర్మాణం పేరుతో ప్రజలను టీడీపీ ప్రభుత్వం మభ్య పెట్టింది. ఐదేళ్లుగా పేదల గురించి పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు హడావిడిగా ఇల్లు ఇచ్చేస్తామంటున్నారు. ఇంత వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అద్దె ఇంటిలోనే కష్టంగా బతుకుతున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ వల్ల ఎలాంటి లాభమూ లేదు.  

– జబీనా, హస్నాబాద్, హిందూపురం 


పునాది దశలోనే ఆగిపోయిన అపార్ట్‌మెంట్‌ నిర్మాణం 

పునాది దశలోనే..  
రాయదుర్గం మున్సిపాలిటీలో అఫర్ట్‌బుల్‌  హౌసింగ్‌ కింద 2,418 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి దాకా 1,791 మంది అర్హులుగా తేలారు. వీరిలో దాదాపు వందమందికిపైగా డీడీలు చెల్లించారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మల్లాపురం సమీపంలో అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే పట్టణానికి దూరంగా ఉండడం, వసతుల కల్పనపై స్పష్టత లేకపోవడంతో అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులు పునాది దశలోనే ఆగిపోయాయి.   – రాయదుర్గం టౌన్‌ 

సందిగ్ధంలో లబ్ధిదారులు  
ఈమె పేరు కటికే మోతీబాయి.  భర్త మృతి చెందగా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. రాయదుర్గంలోని ఐదో వార్డులో బాడుగ ఇంటిలో నివసిస్తున్నారు. నాలుగు నెలల క్రితం రెండో కేటగిరి ఇంటి కోసం అప్పు చేసి రూ.12,500 డీడీ చెల్లించారు. అయితే నేటికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. కట్టిన డబ్బు వాపసు వస్తుందో లేదా అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఇల్లు మంజూరు చేస్తారో లేదోననే సందిగ్ధంలో ఆమె నలిగిపోతోంది.   

ఇప్పటి వరకు హౌస్‌ ఫర్‌ ఆల్‌ స్కీంకు డీడీల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలిలా..   



అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లి వద్ద అర్ధా్ధంతరంగా ఆగిపోయిన ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పనులు   
అర్హులైన వారందరికీ ఇల్లు కట్టిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళ్తున్నామంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం హోరెత్తించారు. అధునాతన భవనాలు ఏర్పాటు చేస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపారు. వీరి మాటలు నమ్మి అప్పులు చేసి తమ వాటా కట్టిన లబ్ధిదారులు ఇపుడు ఆందోళన చెందుతున్నారు.   

అద్దె ఇళ్లలో మగ్గుతున్నాం
సొంతింటి కల నెరవేరుతుందని చాలా ఆశపడ్డాం. డిపాజిట్లు కట్టాలని చెబితే ఏడాది క్రితమే చెల్లించాం. ఇప్పటికీ మాకు ఇల్లు మంజూరు కాలేదు. అన్నీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే కేటాయించుకున్నారు. దివ్యాంగులకు రెండు, మూడు అంతస్తుల్లో కేటాయించారు. ఇది చాలా అన్యాయం. వేలాది రూపాయలు నెలనెలా చెల్లిస్తూ అద్దె ఇళ్లలోనే మగ్గుతున్నాం. గృహ నిర్మాణం మొత్తం ప్రభుత్వం భరించకుండా బ్యాంక్‌ లింకేజీ పేరుతో మమ్మల్ని అప్పుల పాలు చేయాలని చూస్తున్నారు. రోజు వారి కూలి పనులతో పొట్ట పోసుకునే వారు బ్యాంక్‌ రుణాన్ని ఎలా చెల్లించగలుగుతారో ప్రభుత్వ పెద్దలకు అర్థం కాకపోవడం దురదృష్టకరం.    

      – రాము పుట్టపర్తి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement