ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు.. బాబు కుట్ర

Chandrababu conspiracy to reduce the percentage of voting  - Sakshi

సాక్షి, అమరావతి: ఎక్కువ మంది ఓటు వేసేందుకు రాకుండా అడ్డుకోవడం ద్వారా పోలింగ్‌ శాతం తగ్గించాలన్న కుట్రలో భాగంగానే సీఎం చంద్రబాబు పోలింగ్‌ మొదలైన కొద్ది సేపటికే ఈవీఎంలు పనిచేయడం లేదంటూ పుకార్లు పుట్టించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పోలింగ్‌ మొదలైన కొద్దిసేపటికే రాష్ట్రంలో 30 శాతానికి పైగా పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌కు డిమాండ్‌ చేస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా చేయడానికేనని పద్మ, నాగిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

సాంకేతిక సమస్యతో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా చెప్పినా.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈవీఎంలను సాకుగా చూపి పోలింగ్‌ జరగకుండా చేయడంతో పాటు దాడులతో ప్రజలను భయపెట్టాలని చూశారని ఆరోపించారు. ఎన్నికల సంఘమే స్వయంగా చెప్పినా తీరు మార్చుకోని టీడీపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు భయం పట్టుకుందని.. ఆ భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డారని అన్నారు. టీడీపీ నాయకుల దాడులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top