సాక్షి, అమరావతి: మూడు రాజధానుల గురించి తన గ్రామం వెళ్లి సభ పెట్టాల్సిన అవసరం మంత్రులకు ఏం వచ్చిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. అసలు బుద్ధి ఉన్న వాడెవడైనా రాజధానికి అమరావతి వదిలేసి విశాఖపట్నం వెళతాడా అంటూ వ్యాఖ్యానించారు. తమ గ్రామం నుంచి వచ్చే వారు అమరావతి వదిలి విశాఖపట్నం వెళ్లరని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుపడుతూ జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం తుగ్లక్ చర్య అని శేఖర్‌గుప్తా చెప్పారంటూ ఆయన మాట్లాడిన వీడియో ప్రదర్శించారు.
అధికార వికేంద్రీకరణవల్ల అభివృద్ధి జరగదని, పైగా మూడుచోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేయడంవల్ల భారం ఇంకా పెరుగుతుందన్నారు. తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని చెప్పారు. అమరావతిపై విచారణలు చేయిస్తామంటున్నారని.. గతంలో తనపై సీబీఐ కేసులన్నాయని.. అయితే ఆధారాలు చూపలేకపోయారని చెప్పారు. విశాఖపట్నంలో వేల ఎకరాలు చేతులు మారాయని త్వరలో అవి బయటకు వస్తాయని చెప్పారు.
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ కంపెనీలు వస్తే పంపించేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పెట్టే సభలకు వెళ్లవద్దని ప్రజలను కోరారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి తాము వ్యతిరేకం కాదని, గతంలో తామే అక్కడ పెట్టాలని చెప్పామన్నారు. ఐఏఎస్ అధికారులు ఇష్టానుసారం చేస్తే కుదరదని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


