నన్ను మాట్లాడనివ్వకపోతే మర్యాద ఉండదు! | Chandrababu Comments On Speaker Tammineni Sitaram | Sakshi
Sakshi News home page

నన్ను మాట్లాడనివ్వకపోతే మర్యాద ఉండదు!

Dec 12 2019 4:12 AM | Updated on Dec 12 2019 10:13 AM

Chandrababu Comments On Speaker Tammineni Sitaram - Sakshi

స్పీకర్‌ను బెదిరిస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు బుధవారం శాసనసభలో స్పీకర్‌ను బెదిరించేలా మాట్లాడారు. తనను మాట్లాడనివ్వకపోతే మర్యాద ఉండదంటూ స్పీకర్‌ వైపు వేలెత్తి చూపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని చెప్పినా చంద్రబాబు వినకపోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం పద్ధతిది. ప్రతిపక్ష నేత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్పీకర్‌ స్థానానికి కూడా గౌరవం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మీ మీద నాకు గౌరవం ఉంది. మీరు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. స్పీకర్‌ స్థానానికి మర్యాద గురించి మాట్లాడతారా?’ అంటూ అసహనం వెలిబుచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష నేత తీరుపై అధికార పక్ష సభ్యులు మండిపడుతూ.. చర్చకు పట్టుబట్టారు. సభాపతిని బెదిరించిన ప్రతిపక్ష నేతను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  
 
అసలేం జరిగింది.. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంపై టీడీపీ సభ్యుల ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బదులిచ్చారు. అనంతరం టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేశారు. ఆ దశలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కలుగజేసుకుని, గురువారం చర్చకు అనుమతిస్తామని చెప్పగా.. చర్చించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇంతలో వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రీ పీహెచ్‌డీ పరీక్షలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తెలుగు మాధ్యమంలో తాను పరీక్ష రాయగా.. టీడీపీ విద్యార్థి విభాగం అభ్యంతరం చెబుతూ వైస్‌ చాన్సలర్‌కు ఫిర్యాదు చేసిందని.. చివరకు ఇంగ్లిష్‌ కోచింగ్‌ తీసుకుని పరీక్ష రాశానన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన ‘బ్రీఫ్డ్‌ మీ’ ఇంగ్లిష్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారని, దాంతో మన రాష్ట్రం పరువు పోయిందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో మాజీ మంత్రి నారాయణ తన స్కూళ్లలో ఎందుకు తెలుగు మీడియం పెట్టలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వరప్రసాద్‌ మాట్లాడుతూ, ఆంగ్ల మాధ్యమంలో చదవుకోవడం వల్లే తాను ఐఏఎస్‌ అవ్వగలిగానని చెప్పారు. 
 
నన్ను రెచ్చగొడితే వదిలిపెట్టను: చంద్రబాబు 
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు ఇంగ్లిష్‌ రాదంటూ మాట్లాడుతున్నారని.. తన అభివృద్ధి చూసి క్లింటన్, బిల్‌గేట్స్‌ రాష్ట్రానికి వచ్చారంటూ చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరబూశాయి. ‘అనవసరంగా రెచ్చగొడితే వదిలిపెట్టను. రెచ్చిపోతే ఎవరూ నన్ను కంట్రోల్‌ చెయ్యలేరు. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’ అని ఆగ్రహంగా అన్నారు. తానెప్పుడో ఎంఏ చేశానని, వారిలా ఎక్కడో ఏదో యూనివర్శిటీలో చదువుకోలేదని చెవిరెడ్డినుద్దేశించి అన్నారు. తాను ఎస్వీ యూనివర్శిటీలోనే చదివానని.. 40 ఏళ్ళయినా చంద్రబాబు పీహెచ్‌డీ పూర్తి చేయలేదని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. అనంతరం స్పీకర్‌ మరో ప్రశ్నకు అనుమతించారు. ఆ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతుండగా చంద్రబాబు తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీనికి స్పీకర్‌ అనుమతించలేదు.  
 
స్పీకర్‌ స్థానం పట్ల సభ్యత ఉండాలి 
‘మాట్లాడనివ్వకపోతే మర్యాద ఉండదు’ అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించడంపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ‘మర్యాదలేకుండా మీ పట్ల ఎలా ప్రవర్తించాను. మీ అనుభవం ఎవరికి కావాలి? స్పీకర్‌ స్థానం పట్ల సభ్యత ఉండాలి’ అని అన్నారు. అయినా చంద్రబాబు అలాగే మాట్లాడడంతో.. ‘మీరు అసలు ప్రతిపక్ష నేతేనా? ఏంటిది? ఇది మంచిది కాదు. మీరు సంయమనం పాటించాలి’ అని స్పీకర్‌ అభ్యంతరం తెలిపారు.  
 
సస్పెండ్‌ చెయ్యాల్సిందే.. 
స్పీకర్‌ పట్ల చంద్రబాబు తీరుపై అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించాలని, చంద్రబాబును సభ నుంచి సస్పెండ్‌ చేయాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు. సభను నియంత్రించడం, బెదిరించడం చంద్రబాబుకు తగదని ఎమ్మెల్యే వేణు పేర్కొన్నారు. స్పీకర్‌ను చూసి ఓర్వలేక నిగ్రహం కోల్పోతున్న విపక్ష నేతను క్షమించకూడదని మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు తీరు సరైంది కాదని జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా స్థానాన్ని గౌరవించడం తెలియని చంద్రబాబు విపక్ష నేత కావడం దురదృష్టకరమని పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు అభిప్రాయపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement