
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస బృందం సోమవారం రాష్ట్రానికి రానుంది. రాష్ట్రంలో మూడురోజులపాటు పర్యటించనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సోమవారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనుంది. సాయంత్రం 7.30 నుంచి 8.30 గంటల వరకు సీఈవో రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయ నుంది.
మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. 24న ఉదయం 10 నుంచి ఉదయం 11 గంటల వరకు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో సమావేశమై ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనుంది. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశం కానుంది. మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల కమిషనర్ల బృందం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది.