సీబీఐ విచారణ జరిపించాలి

CBI should investigate on TTD Issue says Bhumana - Sakshi

     పాలకమండలిని పాపాల మండలిగా మార్చారు

     హిందుత్వాన్ని దెబ్బతీసే యత్నం 

     సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన ధ్వజం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: పవిత్ర తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాబోయే ప్రజా ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన అర్చకులను తిరిగి నియమించడమే కాకుండా అర్చక, పూజారుల వ్యవస్థలను పటిష్టం చేస్తుందన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ రాక్షస క్రీడ ఆడుతోందని ఆరోపించారు. వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వ అర్చకులు, ఆచార వ్యవహారాలపై చంద్రబాబు సర్కార్‌ విష ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే వారసత్వ అర్చక కుటుంబాల్లో ప్రభుత్వం చిచ్చు రగిల్చిందని నిప్పులు చెరిగారు. తిరుమలలోనూ చంద్రబాబు కులాల కుంపట్లు పెట్టి ఆరని అగ్ని జ్వాలను రగిల్చారని ధ్వజమెత్తారు. హిందుత్వాన్ని దెబ్బతీసి అమరావతిలో మాదిరిగా బౌద్ధాన్ని నెలకొల్పేందుకూ ఇవన్నీ చేస్తున్నట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆగమ శాస్త్రానికి సంబంధించిన సందేహాలను లేవనెత్తితే నివృత్తి చేయాల్సింది పోయి ఆయనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. స్వామి వారి నైవేద్యాల పోటులో ఏం జరిగిందో టీటీడీ చెప్పాలన్నారు. సంభావన అర్చకులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం అధికార పార్టీకి మంచిది కాదన్నారు. కులాల మధ్య కుంపట్లు రగిల్చి చలి కాల్చుకోవాలనే తత్వం చంద్రబాబుదని దుయ్యబట్టారు.

తిరుమలలో ఐఏఎస్‌ అధికారులు చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతున్నారనీ, పోటులో 20 రోజుల పాటు ఏం జరిగిందో తెలియదని ఈవో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆలయంలో సేవలు ఆగమోక్తంగా జరగడం లేదని, స్వామి వారి ప్లాటినం వజ్రం పోయిందని రమణదీక్షితులు అనుమానాలు వ్యక్తం చేయడంలో తప్పేముందన్నారు. పాలక మండలిని పాపాల మండలిగా మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి పాప ప్రక్షాళన చేసుకోవాలని భూమన డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top