ప్రభుత్వానికి సీబీఐ పెంపుడు చిలుక

CBI action against Akhilesh Yadav turns into political slugfest - Sakshi

అఖిలేశ్‌పై సీబీఐ దర్యాప్తు వార్తలపై పార్లమెంట్‌ స్తంభన

లోక్‌సభలో టీడీపీ, ఏఐఏడీఎంకే సభ్యుల సస్పెన్షన్‌

హెచ్‌ఏఎల్‌పై తప్పుదోవ పట్టిస్తున్నారు: రక్షణమంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సీబీఐని పెంపుడు చిలకలా మార్చేసిందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) ఆరోపించింది. సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనీ, ఆ సంస్థ అధికార పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించింది. ఇసుక కుంభకోణానికి సంబంధించి ఎస్‌పీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తలు సోమవారం పార్లమెంట్‌ను కుదిపివేశాయి. లోక్‌సభలో సమాజ్‌వాదీ సభ్యులు ఆగ్రహంతోతమ వద్ద ఉన్న పత్రాలను చించివేసి, పెద్దగా నినాదాలు చేసుకుంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ సెక్రటరీ జనరల్‌ డెస్క్‌లోని అధికారుల వద్ద ఉన్న పత్రాలను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు.

ఇదే అంశంపై రాజ్యసభలో ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆప్, ఆర్‌జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వీరితోపాటు రఫేల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని ఉభయ సభల్లోనూ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన కొనసాగించారు. కావేరీ నదిపై కర్ణాటకలో డ్యామ్‌ నిర్మాణాన్ని ఆపాలంటూ ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో నిలబడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను ఏఐఏడీఎంకేకు చెందిన ముగ్గురు, టీడీపీ సభ్యుడు ఒకరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. ఈ గందరగోళం మధ్యనే పర్సనల్‌ లా, బాలలకు ఉచిత నిర్బంధ విద్య, ఉపాధ్యాయ విద్య జాతీయ కౌన్సిల్‌ సవరణ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది.  

కాంగ్రెస్‌వి దురుద్దేశపూరిత సందేహాలు
హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులిచ్చినట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన అబద్ధమంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై మంత్రి నిర్మలా సీతారామన్‌ సభకు వివరణ ఇచ్చారు. ‘2014–18 మధ్య కాలంలో హెచ్‌ఏఎల్‌కు ప్రభుత్వం రూ.26వేల కోట్ల విలువైన కాంట్రాక్టులిచ్చింది. మరో రూ.73 వేల కోట్ల ఆర్డర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 83 తేజస్‌ విమానాలు (రూ.50 వేల కోట్లు), 200 హెలికాప్టర్లు (20 వేల కోట్లు), 19 డార్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు (3,400 కోట్లు), ఇతర రకాల హెలికాప్టర్లు (15 వేల కోట్లు), ఏరో ఇంజిన్‌ (8,400 కోట్లు) ఉన్నాయి.  ప్రతిపక్షం అసత్యాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే, సభను మంత్రి తప్పుదోవ పట్టించినందున సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. హెచ్‌ఏఎల్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ ఆ సంస్థ సీఎండీ మాధవన్‌ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై విచారణకు జేపీసీ వేయాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యసభ పొడిగింపు
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలను కేంద్రం మరో రోజు పొడిగించాలని నిర్ణయించింది.ఈబీసీ కోటా బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top