చంద్రబాబుకు కంటిచూపు మందగించింది.. | Botsa Satyanarayana Fires On chandrababu Over False Allegations | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కంటిచూపు మందగించినట్లుంది : బొత్స

Oct 11 2019 4:13 PM | Updated on Oct 11 2019 7:30 PM

Botsa Satyanarayana Fires On chandrababu Over False Allegations - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆదర్శ పాలన చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు పథకాలను తామే ముందు తీసుకొచ్చామని అబద్దాలు చెబుతున్న చంద్రబాబుకు కంటిచూపు మందగించినట్లుందని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో తాత్కాలికంగా కట్టిన సచివాలయాన్నే చంద్రబాబు గ్రామ సచివాలయ వ్యవస్థ అనుకున్నారేమోనని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబులా అనవసరమైన మాటలు చెప్పడం రాదని.. ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారని అన్నారు.

టీడీపీ హయాంలో తప్పులు చేసిన చింతమనేనిపై ఒక్క కేసు అయినా రిజిస్టర్‌ చేశారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కాల్‌మనీ కేసులో అభియోగాలు వచ్చిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.  విశాఖ పార్టీ మీటింగ్‌లో కరెంట్‌ పోయిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి మరచి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన అన్యాయం కంటే.. గత ఐదేళ్లలో టీడీపీ దోపిడీ వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసి దివాళా తీయించింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు. 

విశాఖలో భూ రికార్డులను తారుమారు చేసింది టీడీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందని.. అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అయ్యన్నపాత్రుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement