టిడ్కో మిగతా ఇళ్లకు డిసెంబర్‌లో రివర్స్‌ టెండర్లు

Botsa Satyanarayana Comments On Chandrababu Naidu - Sakshi

తొలిదశలో రూ.105.91 కోట్లు ఆదా: మంత్రి బొత్స

చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా మాట్లాడుతున్నారు

సాక్షి, అమరావతి: టిడ్కో (ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో రివర్స్‌ టెండరింగ్‌  చేపట్టామని, ఇప్పటికే తొలిదశ టెండర్ల ప్రక్రియ పూర్తైందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలి దశ టిడ్కో ఇళ్ల రివర్స్‌ టెండర్లలో రూ.105.91 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. బొత్స శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 65,968 ఇళ్లకు రూ.3,253 కోట్లతో రివర్స్‌ టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

అమరావతి పర్యటనలో అన్నీ అబద్దాలే.. 
చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా అన్నీ అబద్ధాలే వల్లె వేశారని బొత్స పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.9,060 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆయన హయాంలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనన్నారు.  ఇందులో కన్సల్టెంట్లకు రూ.845 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని రూ.321 కోట్లు చెల్లింపులు జరిపారన్నారు. రాజధాని బాండ్లు, హడ్కో రుణాలకు వడ్డీ కింద తాము రూ.330 కోట్లు చెల్లించామని తెలిపారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా మాట్లాడుతున్నారని, సీఆర్‌డీఏ పేరుతో అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ కింద పప్పు బెల్లాల్లా పంచారని విమర్శించారు.  

బాబు సర్కారు దోపిడీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బొత్స
- గత ప్రభుత్వం 14,368 ఇళ్ల నిర్మాణానికి రూ.707.03 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా వీటికి రివర్స్‌ టెండర్లలో రూ.601.12 కోట్లకు కోట్‌ చేసి నిర్మాణ సంస్ధలు ఎల్‌ – 1గా నిలిచాయి. అంటే రివర్స్‌ టెండర్ల ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. 
పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?  
మిగతా ఇళ్లకు డిసెంబరు 13, 20, 26వతేదీల్లో మూడు విడతలుగా రివర్స్‌ టెండర్ల నిర్వహణ. 
గత సర్కారు మాదిరిగా ఇళ్ల నిర్మాణానికి పాత రేట్లతో టెండర్లు పిలిచి ఉంటే ప్రతి లబ్ధిదారుడికి రూ.75 వేల నుంచి రూ.95 వేల వరకు భారం పడేది.  
టీడీపీ సర్కారు అవినీతిని ఎండగట్టి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే పథకానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  
టిడ్కోలో రివర్స్‌ టెండర్ల ద్వారా ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 చొప్పున ప్రజాధనం ఆదా.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top