వాళ్లను ఓడించే సత్తా మాకే ఉంది: లక్ష్మణ్‌

BJP Telangana President Laxman Slams On Opposition Parties In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విపక్షాలపై మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా..అపవిత్ర పొత్తు కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం, జగిత్యాల జిల్లాలతో పాటు కార్వాన్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కుల, మత ప్రాతిపదికన ప్రజలను చీలుస్తూ ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా ఒంటబట్టలేదని.. అయినా కూడా బీజేపీకి ఓట్లు రాకుంటే చాలు అన్నట్లు దిగజారుతున్నారని విమర్శించారు.

ఎన్నికల ముందు తిట్టుకుని అధికార వ్యామోహంతో జేడీఎస్‌, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వేర్వేరు కాదన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సలహా మేరకే కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాం అన్న కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటేసినా, టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వెళ్తుందని, టీఆర్‌ఎస్‌కు ఓటేసినా కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్తుందని వ్యాఖ్యానించారు.

కుటుంబ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీజేపీ మాత్రమే ఓడించగలదని, ప్రజలంతా అవకాశవాద పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. చాప కింద నీరులా బీజేపీ తెలంగాణలో విస్తరిస్తోందని, దక్షిణాదిలో బీజేపీ ఈసారి పాగా వెయ్యడం ఖాయమన్నారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల విషయమై ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమీక్ష చేస్తారని వెల్లడించారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ను దళితులు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top