బాబు.. మమ్మల్ని ఢీ కొట్టే దమ్ముంటే చర్చకు రండి..

BJP MLC Madhav Fires On CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి తప్పు చేశామన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని చెప్పారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్‌.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’  మాధవ్‌ మండిపడ్డారు.

‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు చేశారు. ట్యాక్సులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. దొలేరా నగరంలో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. అక్కడ పీపీపీ విధానం ద్వారా నిర్మాణాలు జరుగుతున్నాయి. దొలేరాలో ప్రపంచంలోని పెద్ద నగరం నిర్మిస్తున్నారు. రూ. 2500 కోట్లు అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చారు. రాజధానిలోని 4600 స్క్వేర్‌ మీటర్స్‌కు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పామన్నారు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరుగుతుంది. డిజైన్లు మార్చి లేట్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి రాని విధంగా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్‌కి విడుదల చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం. ప్లేస్‌, ఏ స్థాయి వ్యక్తులు రావాలో కూడా మీరే చెప్పండి. మహానాడులో ప్రవేశపెట్టిన  తీర్మానాల్లో ఒక్కటి కూడా రాష్ట్రాభివృద్ధికి ఉపయోడపడేవి లేవు. కచ్చితంగా సవాలు స్వీకరించి మమ్మల్నీ ఢీ కొట్టే దమ్ముంటే చర్చకు రండి. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు. 

కేంద్రం పన్నులు కొట్టొద్దు అంటూ బాబు పిలుపునివ్వడం దారుణం. ప్రపంచ దేశాలకు బాబాను ఇంచార్జ్‌గా పంపాలి. దేశం ఒక్కటే కాదు.. ప్రపంచ దేశాల సమస్యలన్నీ తీర్చే ఏకైక వ్యక్తి చంద్రబాబే. కేంద్ర పథకాలన్నీ చంద్రబాబు రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో బీజేపీకి ధీటైన ప్రతిపక్షం లేదు. రాజకీయాల్లో శత్రువుల ఉండరు. ప్రత్యర్థులు మాత్రమే వుంటారు. ఈ విషయం లోకేష్‌కు తెలియక  శత్రువులు అంటూ అజ్ఞానిలా మాట్లాడారు.. లోకేష్‌కు రాజకీయ అనుభవం లేదని’  ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top