ఎంఐఎంను ఎందుకు కట్టడి చేయట్లేదు?

BJP Leader Laxman Comments On CM KCR - Sakshi

సీఎంను ప్రశ్నించిన కె.లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేక కుహనా మేధావులు, కుహన లౌకికవాదులు కడుపుమంటతో దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఢిల్లీలో హింసాత్మక ఆందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. బుధవారం మీడియాసమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఈ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

ఇక్కడ తెలంగాణలో మజ్లిస్‌ పార్టీ, ఎంఐఎం నేతలు సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ఓ వర్గంలో విష బీజాలు నాటుతుంటే సీఎం కేసీఆర్‌ వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మోదీ వ్యతిరేక శక్తులు అల్లర్లకు కుట్ర పన్నాయన్నారు.ట్రంప్‌ పర్యటన సమయంలో ‘ఈశాన్య ఢిల్లీలో దాడులు జరగడానికి కారణమేంటి..? గత కొన్ని రోజులుగా ఆందోళన జరుపుతున్నా.. ట్రంప్‌ రాకతోనే వారి చేతుల్లోకి తుపాకులు ఎలా వచ్చాయి..? కాల్పులు జరపమని పోలీసులకు ఆదేశాలు రాలేదన్నారు. మరి ఈ కాల్పులు ఎవరు జరిపారు? ’ఈ ప్రశ్నలకు సమాధానం లేదని చెప్పారు. తెలంగాణలో సీఏఏకు మతం రంగు పులిమి ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య విష బీజాలు నాటుతుంటే కేసీఆర్‌ ఏం చేస్తున్నారు..? మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు..?అని ప్రశ్నించారు.  

కిషన్‌రెడ్డి, జయశంకర్‌లకు విజ్ఞప్తి... 
టెక్సాస్‌ రాష్ట్రంలోని ఫ్రీస్కో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజా గవిని, దివ్య తో పాటు మరొకరు ప్రేమ్‌ నాథ్‌ రామ్‌ నాథ్‌ మరణించడం పట్ల లక్ష్మణ్‌ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. వారి మృతదేహాలను భారత్‌కు తెప్పించే విధంగా తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ జయశంకర్లకు లక్ష్మణ్‌ ఫోన్లో కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top