కలిసి పనిచేద్దాం.. రండి

BJP Leader Laxman Call to the People to come with BJP - Sakshi

అన్నివర్గాల ప్రజలు బీజేపీలోకి రావాలని కె.లక్ష్మణ్‌ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు కలసి పనిచేసేందుకు బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బీజేపీతో కలిసి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇటు ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, హెడ్‌మాస్టర్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునశర్మ, పీఆర్టీయూ వివిధ జిల్లాల మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు, ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ నేతలు తిరువరంగం ప్రభాకర్, కమిటీ రాష్ట్ర , జిల్లాల నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో  బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. యాదాద్రిలో లక్ష్మీ నర్సింహస్వామి చరిత్రను కాలరాసి కేసీఆర్‌ చిత్రాలతో తన చరిత్రను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణకు కావాల్సింది కేసీఆర్‌ చరిత్ర కాదని, ఉద్యమకారుల చరిత్ర అని పేర్కొన్నారు. టీచర్లు, ఉద్యోగుల సమస్య లు పరిష్కరించడం బీజేపీ వల్లే సాధ్యమని లక్ష్మణ్‌ చెప్పారు. టీచర్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు ఫామ్‌ హౌస్‌ పాలేర్లుగా ఉండొద్దన్నారు. 

నిజాం అడుగుజాడల్లో కేసీఆర్‌: కిషన్‌రెడ్డి 
గతంలో సమస్యలపై ముఖ్యమంత్రులను కలిసే అవకాశం ఉండేదని, కేసీఆర్‌ ప్రభుత్వంలో సంఘ నాయకులకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకే దిక్కులేదని కిషన్‌రెడ్డి అన్నారు. నిజాం అడుగుజాడల్లో కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ బలమైన శక్తిగా మారేందుకు రిటైర్డ్‌ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

ఎన్‌ఆర్‌సీ ఆలోచన లేదు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అస్సాంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తున్నామని, దానిని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వంద రోజుల పాలనలో పలు చారిత్రక, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ట్రిపుల్‌ తలాక్, ఆర్టికల్‌ 370 రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు.  రాష్ట్రంలో ఎరువుల కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు. రాష్ట్రం 7.12 లక్షల టన్నుల యూరియా అడిగితే కేంద్రం అంతకంటే ఎక్కువే ఇచ్చిందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top