హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలపై స్పందించిన లక్ష్మణ్‌

BJP Leader K Lakshman About Huzurnagar By Poll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఉప ఎన్నికతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ టికెట్‌ ఆశించే బీజేపీ ఆశావాహులు 8మంది ఉన్నారన్నారు. రామ్మోహన్‌ రావు, జైపాల్‌ రెడ్డి, రామకృష్ణ , శ్రీలత రవీంద్ర నాయక్‌లు వంటి పలువురు టికెట్‌ ఆశిస్తున్నారని తెలిపారు. స్క్రీనింగ్‌ చేసి జాతీయ అధ్యక్షుడికి పంపుతామన్నారు. అంతేకాక శంకరమ్మ బీజేపీ నుంచి పోటీ చేస్తారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం అన్నారు. ఇంతవరకు ఆమె మమ్మల్ని కలవలేదు.. తాము కూడా ఆమెను సంప్రదించలేదని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని ఉద్యోగ సంఘాలు ఎందుకు అన్న కేసీఆర్‌ తన ఇంట్లో ఇన్ని పదవులు ఎందుకు అని అనుకోవచ్చు కదా అన్నారు.

ఇన్ని రోజుల సచివాలయ భవనాలు కూలుస్తా అన్న కేసీఆర్‌ తాజాగా హై కోర్టును మారుస్తా అంటూ కొత్త పాట పాడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. కేసీఆర్‌వి ధన రాజకీయాలని.. తమకు మాత్రం ప్రజా సేవే ముఖ్యమన్నారు. ఉద్యమకారులను పక్కకు పెట్టి.. ఉద్యమంపై రాళ్లేసిన వారిని పార్టీలో చేర్చుకున్నారని.. అందుకే ప్రస్తుతం పార్టీలో ఓనర్లు, కిరాయిదార్ల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గంటలు గంటలు కూర్చుని దేని గురించి చర్చిస్తున్నారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. అన్నింటిని పక్క రాష్ట్రంతో పోల్చుకునే కేసీఆర్‌ ఎందుకు ఫాలో కావడం లేదని అడిగారు. తండ్రి, కొడుకులకు బీజేపీ అంటే భయం పట్టుకుందని.. అందుకే సభలో లేకపోయినా తమను తల్చుకుంటున్నారన్నారు. మున్సిపాలిటీల్లో బీజేపీ పోరుబాట పడుతుందని.. కొత్తగా తెచ్చిన చట్టం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు తిరగబడితే రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యమే బీజేపీ ఎన్నికల ప్రచారం అన్నారు లక్ష్మణ్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top