2019 సమరానికి ఉత్సాహంగా... | Sakshi
Sakshi News home page

2019 సమరానికి ఉత్సాహంగా...

Published Wed, May 16 2018 1:38 AM

Bjp getting ready to 2019 lok sabha elections - Sakshi

ఉత్తరాది పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ప్రధాని మోదీ– బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు చెరిపివేయగలిగారు. వారిద్దరి ఎత్తుగడలు, వ్యూహాలు కర్ణాటకలో ఫలించిన నేపథ్యంలో.. డిసెంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోరాటానికి కమలం పార్టీ ఉత్సాహంగా సిద్ధమవుతోంది.

అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీకి కన్నడ శాసనసభ ఫలితాలు ఉత్తేజాన్నిచ్చాయి. నిజానికి నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదాన్ని నిజం చేస్తూ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధించడంతో కాంగ్రెస్‌ బక్కచిక్కిపోయింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సామర్థ్యం ఆ పార్టీకి లేదని ఇప్పటికే స్పష్టమైంది.

ఫ్రంట్‌ ప్రయత్నాలు ఫలించేనా...
మరోవైపు, ప్రధాన ప్రాంతీయ పార్టీలన్ని బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఏడాదిలో ఫలించకపోవచ్చు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట మూడో జాతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు తగిన సమయం, అవకాశాలు కనిపించడం లేదు. కర్ణాటకలో జేడీఎస్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు.

పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోకడల వల్ల అక్కడ బీజేపీయేతర పార్టీలతో తృణమూల్‌కు పొత్తు కుదిరే అవకాశం లేదని బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. వామపక్షాలు బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తులకు అవకాశం లేకపోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, అందరికీ వికాసం వంటి హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఎన్నికల నినాదాలతో ముందుకు సాగాలో బీజేపీ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థికంగా అద్భుత విజయాలు లేకపోవడంతో.. మతపరమైన ఎజెండాతోనే బీజేపీ ముందుకెళ్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయోధ్య వంటి అంశాలపై పోరాడుతుందని అంచనా వేస్తున్నారు.  

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement