‘మిజోరం’థంగ ప్రభంజనం 

Bjp And Congress Are Failed In Mizoram - Sakshi

26 సీట్లతో కాంగ్రెస్‌ను మట్టికరింపించిన ఎంఎన్‌ఎఫ్‌

కాంగ్రెస్‌ ఐదు, బీజేపీ ఒక్క సీటుకు పరిమితం

గవర్నర్‌ను కలుసుకున్న ఎంఎన్‌ఎఫ్‌ చీఫ్‌ జోరంథంగ

మిజోరంలో సంపూర్ణ మద్య నిషేధానికి హామీ  

ఐజ్వాల్‌/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి గత నెల 28న జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) విజయదుందుభి మోగించింది. తాజాగా మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంఎన్‌ఎఫ్‌ 26 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా, అధికార కాంగ్రెస్‌ కేవలం ఐదు సీట్లకే పరిమితమయింది. అంతేకాకుండా మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత లాల్‌ తన్హావ్లా పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు చంఫాయి సౌత్, సెర్ఛిప్‌ల్లో ఓటమి పాలయ్యారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే సీటుకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో ఎంఎన్‌ఎఫ్‌ 37.6 శాతం, కాంగ్రెస్‌ పార్టీ 30.2 శాతం, బీజేపీ 8 శాతం ఓట్లను దక్కించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 21 స్థానాలు అవసరం కావడంతో దాదాపు పదేళ్ల తర్వాత ఎంఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు జోరంథంగ(74) మిజోరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్‌ఎంఎఫ్‌ నేతలు జోరంథంగను పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. దీంతో జోరంథంగ మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ కె.రాజశేఖరన్‌ను కలుసుకున్నారు. అసెంబ్లీలో తమకే మెజారిటీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నార్త్‌–ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్‌ఈడీఏ), ఎన్డీయేలో తాము భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ లేదా కాంగ్రెస్‌ తో కలిసి మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము 26 స్థానాలు సాధించినందున సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం, రోడ్ల పునరుద్ధరణ, సామాజిక–ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల(ఎస్‌ఈడీపీ)ను చేపడతామని ప్రకటించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి లాల్‌ తన్హావ్లా.. గవర్నర్‌ను కలుసుకుని రాజీనామాను సమర్పించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రతిపక్షాల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేశామన్నారు. మిజోరం అసెంబ్లీకి 2008, 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా 32, 34 స్థానాలతో అధికారాన్ని నిలుపుకుంది. తాజా ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 

ప్రకంపనలు రేపుతున్న పుస్తకం.. 
తీవ్రవాదిగా పనిచేసే రోజుల్లో జోరంథంగ మిజో భాషలో ‘మిలరి’అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఈశాన్య భారతంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు చైనా, పాక్‌లు ఏవిధంగా సాయం చేశాయో ఆయన విపులంగా వివరించారు. మిజో తీవ్రవాదులకు ఢాకాలో పాక్‌ శిక్షణ, ఆయుధాలను అందించడాన్ని, 1971 యుద్ధం తర్వాత ఈ సాయం ఆగిపోవడాన్ని అందులో ప్రస్తావించారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోరంథంగ మాట్లాడుతూ.. ఉద్యమం సమయంలో మయన్మార్‌లోని అటవీప్రాంతం గుండా కొన్ని రోజులపాటు నడిచితూర్పుపాకిస్తాన్‌(బంగ్లాదేశ్‌)లో ఆశ్రయం పొందేవాళ్లమని తెలిపారు. మిలరీ పేరుతో రాసిన తన ఆత్మకథను త్వరలోనే విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే ఇందులోని అంశాలు వివాదాస్పదం అవుతాయనీ, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌లకు మింగుడుపడబోవని వ్యాఖ్యానించారు. ప్రత్యేక మిజోరం ఉద్యమం సమ యంలో తాము చైనా సుప్రీం లీడర్‌ మావో, ప్రధాని చౌ ఎన్‌ లై, కమ్యూనిస్టు నేతలు లిన్‌బావో, చియాంగ్‌ చింగ్‌తో భేటీ అయ్యామని జోరంథంగ బాంబు పేల్చారు. భారత్‌లో అశాంతి సృష్టించేందుకు అప్పట్లో తమలాంటి గెరిల్లాలకు చైనా ప్రభుత్వం ఆయుధాలు అందజేసిందని గుర్తుచేసుకున్నారు. 

ఇంగ్లిష్‌ సాహిత్యం నుంచి తీవ్రవాదం వైపు.. 
ఇంఫాల్‌లోని డీఎం కళాశాలలో డిగ్రీ చదివేరోజుల్లో తీవ్రవాదం పట్ల ఆకర్షితులైన జోరంథంగ మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌)లో చేరారు. ఈ ప్రాంతంలో 1959లో కరువు సందర్భంగా మిజో పర్వతప్రాంతాల్లో వందలాది మంది ఆకలికి అలమటించి, ప్లేగు వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలకు ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు మిజో కల్చరల్‌ సొసైటీ అనే సంస్థ ముందుకొచ్చింది. కాలక్రమంలో ఇది మిజో నేషనల్‌ ఫెమిన్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌ఎఫ్‌)గా, చివరికి మిజో నేషనల్‌ ఫ్రంట్‌గా మారింది. 1966, మార్చి 1న ఎంఎన్‌ఎఫ్‌ నేత లాల్‌డెంగా నేతృత్వంలోని ఈ సంస్థ భారత్‌ నుంచి మిజోరంకు స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ సందర్భంగా ఉద్యమంలో చేరిన జోరంథంగ లాల్‌డెంగా విశ్వాసాన్ని చూరగొ న్నారు. దీంతో ఆయన 1969లో ఎంఎన్‌ఎఫ్‌ కార్య దర్శిగా, మరో పదేళ్లకు ప్రవాసంలో ఉన్న మిజోరం ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. అజ్ఞాతంలో ఉంటూనే బీఏ(ఇంగ్లిష్‌ ఆనర్స్‌) ఉత్తీర్ణులయ్యారు. శాంతిచర్చల సందర్భంగా మిజోరం ప్రతినిధిగా లాల్‌డెంగాతో కలిసి పాక్, యూరప్‌లో జోరంథంగ పర్యటించారు. చివరికి భారత ప్రభుత్వంతో 1986, జూన్‌ 30న శాంతిఒప్పందం కుదరడంతో మరుసటి ఏడాది మిజోరం రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో లాల్‌డెంగా ముఖ్యమంత్రిగా, జోరంథంగ ఆర్థికం, విద్యాశాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. 1990, జూలై 7న లాల్‌డెంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో చనిపోవడంతో ఆ యన స్థానంలో జోరంథంగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1998, 2003లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల పాటు మిజోరంను పాలిం చారు. 2008లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేతిలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఓటమిపాలైంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top