పొత్తుల ఎత్తులతో బీజేపీ దూకుడు..!

BJP Aheads in Securing Allainces - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి ఓ పక్క మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ఆపసోపాలు పడుతుండగానే పాలక పక్ష బీజేపీ రెండంటే రెండు రోజుల్లోనే కీలకమైన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో పొత్తులు కుదుర్చుకుంది. లోక్‌సభలోని 543 సీట్లకుగాను ఈ రెండు రాష్ట్రాల్లోనే 87 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎప్పుడు విమర్శనాస్త్రాలను సంధించే పాత మిత్రపక్షం శివసేనతో బీజేపీ సోమవారం పొత్తు కుదుర్చుకోగా, తమిళనాడులో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏఐఏడిఎంకే), పట్టాలి మక్కల్‌ కాట్చి (పీఎంకే) పార్టీలతో మంగళవారం పొత్తు ఖరారు చేసుకుంది. గత అక్టోబర్‌ నెలలోనే బీహార్‌లోని ఆర్జేడీతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెల్సిందే.

మహా కూటమిని ఏర్పాటుచేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఇంకా గందరగోళంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. బీహార్‌లో మహాకూటమిని ప్రకటించినప్పటికీ సీట్ల పంపకాల కసరత్తును ఇంకా చేపట్టాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు చిన్నా చితక పార్టీలను కూటమిలో స్థానం కల్పించేందుకు సతమతం అవుతున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్‌-ద్రావిడ మున్నేట్ర కళగంతో కలవాల్సిన పట్టాలి మక్కల్‌ కట్చీ బీజేపీ కూటమిలోకి వెళ్లడం అన్ని రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న విషయం.

ఎస్‌ రామదాస్‌ నాయకత్వంలోని ఈ పార్టీకి ఉత్తర తమిళనాడులో మంచి బలం ఉంది. వన్నియార్లు, ఇతర వెనకబడిన వర్గాల ప్రజల్లో ఈ పార్టీ సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పించలేదన్న కారణంగా కాంగ్రెస్‌-డీఎంకే కూటమిలో చేరుతానని ఈ పార్టీ ఇదివరకే సంకేతాలు ఇచ్చింది. అయితే ప్రతిపక్ష కూటమి ఇస్తానన్న సీట్లకన్నా ఎక్కువగా, ఏకంగా ఆరు సీట్లు ఇస్తామంటూ బీజేపీ ప్రతిపాదన తీసుకురావడంతో రామదాస్‌ పార్టీ పునరాలోచనల్లో పడింది.

గత నాలుగేళ్లుగా వరుసగా బీజేపీని విమర్శస్తూ రావడమే కాకుండా రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జనవరి నెలలోనే తీర్మానం చేసినప్పటికీ శివసేన.. మళ్లీ బీజేపీతోని కలసిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామమే. 2014 ఎన్నికల సందర్భంగా శివసేనకు 20 సీట్లు కేటాయించిన బీజేపీ, ఈసారి 23 సీట్లు ఇవ్వడానికి ముందుకు రావడమే పొత్తుకు కారణమైందన్నది తెలుస్తోంది. మిగతా 25 సీట్లకు పోటీ చేయడానికి బీజేపీ సిద్ధపడింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున బీజేపీ ఒంటరిగా పోటీ చేసినట్లయితే మహారాష్ట్రలో ఎక్కువ నష్టపోయే అవకాశం ఉండడంతోనే తప్పనిసరి శివసేనతో పొత్తుకు తలొగ్గాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. శివసేనతో ఒప్పందం కుదిరిన మరునాడే తమిళనాడులో ఏఐఏడిఎంకే, పీఎంకేలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 39 సీట్లకుగాను బీజేపీ ఐదు స్థానాలకు, పీఎంకే ఆరు స్థానాలకు పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. అయితే మిగతా అన్ని స్థానాలకు ఏఐఏడిఎంకేనే పోటీ చేస్తుందా? వాటి నుంచి కొన్ని సీట్లను బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందా? అన్న అంశం ఇంకా స్పష్టం కావడం లేదు.

పొత్తులను కుదుర్చుకోవడమే కాకుండా పుల్వామా ఉగ్రదాడి అనంతరం జాతి జనుల దష్టిని తనవైపు తిప్పుకునేలా చేయడంలో కూడా బీజేపీ విజయం సాధించిందని మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కీ అద్వానీల వద్ద సలహాదారుగా పనిచేసిన సుధీంద్ర కులకర్ణి చెప్పారు. మహాకూటమికి లేనిది బీజేపీకి ఉన్నది రాజకీయాలపై స్పష్టతని, తనకు అన్నింటికన్నా విజయం ముఖ్యం అన్న విషయాన్ని బీజేపీ బాగా గ్రహించడం వల్ల చిన్న పార్టీలకు అవసరమైతే రెండు సీట్లు ఎక్కువ ఇచ్చయినా పొత్తు కుదుర్చుకుంటోందని స్వరాజ్‌ ఇండియా పార్టీ నాయకుడు, సామాజిక శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top