నా గెలుపు కార్యకర్తలకు అంకితం | Bhumana Karunakar Reddy Meeting in Chittoor | Sakshi
Sakshi News home page

నా గెలుపు కార్యకర్తలకు అంకితం

Jun 7 2019 10:54 AM | Updated on Jun 7 2019 10:54 AM

Bhumana Karunakar Reddy Meeting in Chittoor - Sakshi

వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

చిత్తూరు, తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు తన గెలుపు అంకితమిస్తున్నట్టు తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక డీబీఆర్‌ కల్యాణమండపంలో జరిగిన వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర  సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. కార్యకర్తలు తనపై ఎంతో విశ్యాసంతో గెలుపు కోసం కష్టపడ్డారని, వారికి ఈ సందర్భంగా కన్నీటితో పాదాలను కడుగుతున్నానని తెలిపారు. తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకున్నా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం పార్టీలకతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. జగనన్న మీద ఉన్న అభిమానంతో, తనను శాసనసభ్యున్ని చేయాలనే దృఢ సంకల్పంతో పార్టీ కార్యకర్తలు పనిచేశారని కొనియాడారు. రాజకీయాల్లో సుమారు 47 సంవత్సరాల అనుభవం ఉందని, ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, ఏ రోజూ అబద్ధపు రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు చేయలేదని తెలిపారు. రాజకీయాలు తనకు వ్యాపకం కాదని, వ్యాపారం అంతకంటే కాదని, ప్రజాసేవే తన ఊపిరని చెప్పారు. తన జీవితం ప్రజాసేవేకే అంకితమని తెలిపారు. తనను శాసనసభ్యునిగా కాకుండా మీలో ఒకరిగా, మీ అన్నదమ్ముడిగా భావించాలని కోరారు. చిన్నతనం నుంచి అభ్యుధయ భావాలతో పెరిగి ఎన్నో ప్రజాఉద్యమాలు చేసి జైలుకు కూడా వెళ్లానని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తలవంచనని, తల దూర్చనని తెలిపారు. సమస్యలపై కార్యకర్తలుగానీ, ప్రజలుగాని తనను ఏ సమయంలోనైనా కలవచ్చని, ఈ విషయంలో ఎవరూ జంకవద్దని చెప్పారు. నగరంలో ఆటో డ్రైవర్‌ దగ్గర నుంచి యాచకుని వరకు ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరంలోని 50 డివిజన్లలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని కార్యకర్తలకు సూచించారు.రానున్న నగర పాలక ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. మంత్రి పదవిపై తనకు ఆశ లేదని, తిరుపతి శాసనసభ్యుడు అంటేనే భగవంతుని ప్రతినిధి అని, ఇంతకంటే గౌరవం తనకు అవసరం లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement