వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాపై విశ్లేషణ

BC, Women, Youth get Priority in YSRCP Candidates List - Sakshi

బీసీలకు, యువతకు పెద్దపీట.. విద్యావంతులకు ప్రాధాన్యం..

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 175మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి.. సంచలనం రేపింది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను విశ్లేషిస్తూ.. పలు ఆసక్తికర అంశాలు, సామాజిక సమీకరణలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల జాబితాలో బీసీలకు, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు, నమ్మకస్తులకు పెద్దపీట వేయడం చూడొచ్చు. అభ్యర్థుల జాబితాలో యువతకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది. అభ్యర్థుల్లో ఉన్నత చదువులు చదువుకున్నవారు పెద్దసంఖ్యలో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. వైఎస్సార్‌సీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో తొమ్మిదిమంది ఆలిండియా సర్వీసులలో పనిచేసిన వారు కావడం గమనార్హం. అంతేకాకుండా సమాజంలో ఉన్నతమైన వైద్యవృత్తి అభ్యసించిన 15మంది డాక్టర్లు ఉన్నారు. ఇక, అభ్యర్థుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్లు 41 మంది ఉండగా.. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు 139 మంది ఉన్నారు.

యువతకు పెద్దపీట
వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో యువతకు పెద్దపీట వేశారు. మొత్తం 175 మంది అభ్యర్థుల్లో 33 మంది 45 ఏళ్ల లోపువారే కావడం ఇందుకు నిదర్శన. 45 నుంచి 60 ఏళ్ల లోపు వారు 98 మంది
 ఉన్నారు. 60 ఏళ్లకు పైబడ్డవారు కేవలం 44 మంది ఉన్నారు. ఇక, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 40 మందికి అవకాశం రాగా.. 119 మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన వారు ఉన్నారు. మరో 24 మంది అభ్యర్థులు మాజీ ఎమ్మెల్సీలు కాగా.. వారిలో 12 మంది గతంలో మంత్రులుగా పనిచేసినవారు ఉన్నారు. మాజీ ఎంపీలైన వరప్రసాద్‌, అవంతి శ్రీనివాస్‌కు ఈసారి అసెంబ్లీ అభ్యర్థులుగా పార్టీ అవకాశం కల్పించింది. ఇక, 37 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీకి ఈసారి టికెట్‌ దక్కింది.

సామాజిక సమీకరణలు..
బీసీలంటే సామాజికంగా వెనుకబడిన తరగతులు కాదు.. సమాజానికి వెన్నెముక కులాలు అని ఘనంగా ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆ విషయాన్ని చాటిచెప్పారు. అభ్యర్థుల జాబితాలో బీసీలకు వైఎస్‌ జగన్‌ గణనీయమైన ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలకు 41 అసెంబ్లీ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాలు కేటాయించి.. ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో ఇచ్చిన వాగ్దానాన్ని వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు. రాజమండ్రి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తానని పాదయాత్రలోభాగంగా బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన వైఎస్‌ జగన్‌ ఆ మేరకు కూడా తన హామీని నిలబెట్టుకున్నారు. రాజమండ్రి నుంచి బీసీ అభ్యర్థికి (మంగన భరత్‌కు) అవకాశం కల్పించారు. ఇక, అభ్యర్థుల జాబితాలో మహిళలకు వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారు. ఏకంగా 15 మంది మహిళలకు ఈసారి టికెట్‌ ఇచ్చారు. ఇక, ఎస్సీలకు 29 స్థానాలకు, ఎస్టీలకు ఏడు స్థానాలను, మైనారిటీలకు ఐదు స్థానాలు కేటాయించి.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు.

చదవండి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..

వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top