యాదవులు విశ్వాసానికి మారుపేరు

Balineni Srinivas Reddy Slams Chandrababu Naidu - Sakshi

వైఎస్సార్‌ సీపీలో వారికి అధిక ప్రాధాన్యం

జిల్లా గృహ నిర్మాణ శాఖలో రూ.500 కోట్ల మోసం

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్లు

చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న చెక్కులు మార్చి నుంచి చెల్లవ్‌

యాదవుల ఆత్మీయ సదస్సులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు సిటీ: యాదవులు విశ్వాసానికి మారుపేరని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం స్థానిక గోపాలనగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. కొఠారి రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో బాలినేని మాట్లాడుతూ ఎన్నికల్లో జనరల్‌ స్థానాల్లో యాదవులను నిలిపి గెలిపిస్తున్న చరిత్ర వైఎస్సార్‌ సీపీదని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో జిల్లాలో యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ పార్టీ కనిగిరి అసెంబ్లీ స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీటు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అన్ని వేళలా యాదవులకు అండగా ఉంటానని బాలినేని భరోసా ఇచ్చారు. రూరల్‌ మండల జెడ్పీటీసీ, మున్సిపల్‌ చైర్మన్‌ వంటి స్థానాలకు కూడా బీసీలకే అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లోని యాదవులతో పాటు అన్ని కులాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు జగన్‌ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

తాను ఎమ్మెల్యేగా నాలుగు దఫాలుగా ఎన్నికైనా అధికారంలో ఉంది కేవలం ఐదేళ్లేనని చెప్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో ఒంగోలుకు రిమ్స్, రామతీర్థం జలాశయం, గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు తాగునీటి కోసం పైపులైన్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించామని గుర్తు చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌ను తెచ్చినందున నిధులు దండిగా వచ్చాయన్నారు. ఒంగోలులో తాగు నీటికి రూ.19.5 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. తన హయాంలోనే నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ చేసినందున నేడు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని బాలినేని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట జగన్‌ పింఛన్‌ రూ.2 వేలు ఇస్తామని ప్రకటించారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఇప్పుడు అదే రూ.2 వేలు ఇస్తున్నారని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేయకుండా కేవలం రూ.10 వేలతో సరిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ తాయిలాలు ఇచ్చే వాళ్లు కావాలో, నిజాయితీ పాలన అందిచే వారు కావాలో మహిళలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గపు ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బాలినేని పిలుపు ఇచ్చారు.

రూ.500 కోట్లకు మోసం
గృహ నిర్మాణంలో రూ.500 కోట్ల మోసం జరిగిందని బాలినేని ఆరోపించారు. జీ ప్లస్‌–3 గృహాల్లో తెలుగుదేశం ప్రభుత్వం మతలబును  ప్రస్తావించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలకు జరిగిన భూసేకరణలోనూ అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు పేదలకు గృహ నిర్మాణం మాటున స్తిరాస్థి వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఇల్లు కట్టిస్తామని నెలకు రూ.2 వేలు కట్టించుకొని మొత్తం కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేస్తారటని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఎంతో మోసం దాగుంతో లబ్ధిదారులు గుర్తించాలన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు, అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తారని చెప్పారు. ఇళ్లు తీసుకున్న రోజునే వారు బ్యాంకు రుణాలు తీసుకోవచ్ఛన్నారు. వైఎస్సార్‌ కుటుంబం ప్రజలకు మాట ఇస్తే దాని కోసం కట్టుబడి ఉంటుందన్నారు. వెనక్కి తగ్గేదిలేదన్నారు. జగన్‌ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని నిజాయితీగా ప్రకటించిన విషయాన్ని బాలినేని ప్రస్తావించారు. అబద్ధాలతో కాలం గడిపే చంద్రబాబుకు ఓటేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మరింత పేదరికంలో మగ్గిపోతారన్నారు. మార్చి తర్వాత డ్వాక్రా మహిళలకు ఇవ్వనున్న చెక్కులు చెల్లవన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డు పెట్టి చంద్రబాబు తన అనుయాయుల ద్వారా కోర్టులో కేసు వేయించి మహిళలను నిట్టనిలువునా మోసగిస్తారన్నారు. వైఎస్సార్‌ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బాలినేని పిలుపు ఇచ్చారు.

బాలినేనికి గొర్రెపిల్ల బహూకరణ
మాజీ మంత్రి బాలినేనికి కండే రమణాయాదవ్‌ ఆధ్వర్యంలో యాదవులు గొర్రె పిల్లను బహూకరించారు. పటాపంజుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ ప్రతినిధులు బాలినేనిని గజమాలతో సన్మానించారు. అంతకు ముందు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. యాదవ యువకులు ద్విచక్ర వాహనాలతో బాలినేనిని వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. మార్గంమధ్యలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేళతాళాలతో ఘనంగా బాలినేనికి స్వాగతం పలికారు. యాదవ సంఘం నాయకులు కటారి శంకర్‌ యాదవ్, కర్నేటి ప్రసాద్, ఎంఎం కొండయ్య యాదవ్, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, యనమల నాగరాజు, ఎందేటి వెంకట్రావు, పల్లపోతుల మోహన్‌రావు, చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, జాజుల కృష్ణ, మట్టే రాఘవ, పటాపంజుల అశోక్, గుర్రం వెంకయ్య, ఎందేటి రంగారావు, కొణికి ఆదిలక్ష్మి, రావులపల్లి ధనలక్ష్మి, దుర్గామల్లేశ్వరి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top