మోదీ ప్రాభవంతోనే వారిద్దరి గెలుపు! | Sakshi
Sakshi News home page

మోదీ ప్రాభవంతోనే వారిద్దరి గెలుపు ఖాయం!

Published Mon, Oct 21 2019 2:44 PM

Assembly polls 2019: What Would Benefit For Fadnavis and Khatter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలకు సోమవారం పోలింగ్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి సారి బీజేపీ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు, మరోసారి ముఖ్యమంత్రులుగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలకు  ప్రాంతీయంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నమూనా నాయకులు. వారేమీ ఎన్నికల ద్వారా ప్రముఖులుగా గుర్తింపు పొందిన నాయకులూ కాదు, సీఎం పదవిలో పోటీలో ఉన్న వ్యక్తులు కూడా కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కులానికో, వర్గానికో చెందిన వారు కూడా కాదు. అనూహ్యంగా ముఖ్యమంత్రులైన ఇరువురు ఆరెస్సెస్‌కు చెందిన వారు. 

దేవేంద్ర ఫడ్నవీస్‌
మహారాష్ట్ర చరిత్రలో పూర్తికాలం పాటు అధికారం కొనసాగిన రెండవ ముఖ్యమంత్రి ఫడ్నవీసే. మరాఠాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గం నుంచి వచ్చిన నిలదొక్కు కోవడమే కాకుండా చాలా తెలివిగా ప్రత్యర్థులను తప్పిస్తూ వచ్చారు. చాలా తెలివిగా మాజీ మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదుర్చుకోవడంలో విజయం సాధించారు. పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలివిగా పరిష్కరించుకోగలిగారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆకర్షించగలిగారు. పార్టీలో అన్ని వర్గాలను మెప్పించగలిగిన పాపులర్‌ నాయకుడు కాకపోయినా కేంద్రంలోని మోదీ ప్రభావం మేరకు మనగుడ సాగిస్తూ వచ్చారు. 

మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌
జాట్‌లు ఎక్కువగా ఉన్న హర్యానాలో పంజాబీ నాయకుడు మనోహర లాల్‌ ఖట్టర్‌ అనూహ్యంగ ముఖ్యమంత్రి అయ్యారు. పదవిలో రాణించేందుకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పంథానే అనుసరించారు. జాట్ల నాయకత్వంలోని ప్రతిపక్షాన్నే ఎదుర్కొంటూనే పాలనపై కొంత దష్టిని కేంద్రీకరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనద్వారా కొంత మంచి పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఖట్టర్‌ కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రాభవంపైనే ఎక్కువగా ఆధారపడి గెలవాల్సిందే. గెలుస్తారనే విశ్వాసం ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాల కుమ్ములాటలు పార్టీకి కలిసి వచ్చే మరో అవకాశం. పైగా డబ్బుగల పార్టీ అవడం వల్ల ఈ ఎన్నికల్లో ఇరువురు ముఖ్యమంత్రులు భారీగానే డబ్బులు కుమ్మరిస్తున్నారు. 

Advertisement
Advertisement