ప్లీజ్‌.. సంయమనం పాటించండి

Assam CM Sarbananda Sonowal Request After NRC Report - Sakshi

ప్రజలకు అసోం సీఎం సోనోవాల్‌ విజ్ఞప్తి

గువాహటి: ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల తర్వాత అసోం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌లో ప్రభుత్వం, పోలీసులు ఉన్నారు. నేటి ఉదయం  నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) తుది ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకో 1.9 కోట్ల మందినే అసోం పౌరులుగా గుర్తించి జాబితాలో చోటు కల్పించారు. సుమారు 40 లక్షల మందికి పౌరసత్వం దక్కకపోవటంతో ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తమయ్యారు. అల్లర్లు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్‌గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోషల్‌మీడియాపై డేగ కన్ను వేశారు.

ప్రశాంతంగా ఉండాలి... ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రజలకు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘గతంలో మొదటి డ్రాఫ్ట్‌ విడుదల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది.  ఇప్పుడు అదే రీతిలో సమన్వయం పాటించాలని ప్రజలను నేను కోరుతున్నా’ అని ఆయన ఓ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే హింసాత్మక ఘటనలను మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిపోర్టు పేరు లేనంత మాత్రన వారిని విదేశీయులుగా భావించబోమని సోనోవాల్‌ ఇదివరకే స్పష్టం చేశారు. 

మమతాగ్రహం.. మరోవైపు ఎన్‌ఆర్‌సీ తుది డ్రాఫ్ట్‌పై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలపై బీజేపీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని, విజభన రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఎన్‌ఆర్‌సీ... అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) పేరిట ముసాయిదాను విడుదల చేసింది.  గతేడాది డిసెంబర్‌ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో.. మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చింది.  ఇక ఇప్పుడు తుది జాబితా పేరిట సోమవారం ఉదయం మరో డ్రాఫ్ట్‌ను రిలీజ్‌ చేసింది. తాజాగా ప్రకటించిన జాబితాతో మొత్తం 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది. అంటే మిగతా 40 లక్షల మంది భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తున్నట్లు అందులో ప్రభుత్వం పేర్కొంది.

అయితే ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించిన జాబితా అని, తుది జాబితా మాత్రం కాదని ఎన్‌ఆర్‌సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా తెలిపారు.అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందని నార్త్‌ ఈస్ట్‌ జాయింట్‌ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top