అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Asaduddin Owaisi Backed The Centre on UN Kashmir Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం పార్టీ చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయంలో ఐరాస ఇచ్చిన నివేదికను తప్పుబట్టిన ఆయన.. అది భారతదేశ అంతర్గత విషయమని తేల్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ‘ఇది మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ఇది ఇండియా సమస్య. నా చివరి శ్వాస వరకు ప్రధాని నరేంద్ర మోదీని నేను వ్యతిరేకిస్తా. కానీ, దేశం ప్రతిష్టకు సంబంధించిన అంశం జోలికొస్తే మాత్రం ప్రభుత్వానికి మేం మద్ధతుగా నిలుస్తాం’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఒకదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఐరాస విభాగానికి లేదు. మానవ హక్కుల సంఘం అన్నది ఈ దేశంలో ఓ స్వతంత్ర్య విభాగం. ఈ విషయంలో మేం ప్రభుత్వం వెంటే ఉంటాం’ అని స్పష్టం చేశారు. శనివారం మక్కా మసీదులో నిర్వహించిన ఓ సభలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

అయితే కశ్మీర్‌లో పరిస్థితికి మాత్రం పీడీపీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణమని ఆయన ఆక్షేపించారు. ‘ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక.. అక్కడి కూటమి ప్రభుత్వ ‘దౌత్య వైఫల్యాన్ని’ ప్రస్పుటిస్తోంది. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులను నిలువరించటంలో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ‘నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించేలా ఉంది. ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో రూపొందించిన నివేదికలా ఉంది. జమ్మ కశ్మీర్‌ రాష్ట్రం మొత్తం భారత్‌లో అంతర్భాగం. పాక్‌.. చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది’ అని భారత విదేశాంగ శాఖ మానవహక్కుల సంఘానికి ఓ లేఖ రాసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top