హోదాపై యూటర్న్‌ : అసెంబ్లీలో తీర్మానం!

AP Govt resolution on Special Status in Assembly - Sakshi

సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి పిల్లిమొగ్గ వేసింది. గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటూ.. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ అదే శాసనసభ వేదికగా మరోసారి తీర్మానం చేసింది. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా  ఇవ్వాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్న ముమ్మరం చేసిన తరుణంలో చంద్రబాబు సర్కారు హోదాపై ఈమేరకు యూటర్న్‌ తీసుకుంది.

గతంలో ప్రత్యేక హోదా కంటే గొప్ప ప్యాకేజీని తీసుకొచ్చామంటూ.. ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి అభినందనలు తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు తీర్మానం చేసింది. ఆ విషయాన్ని, గతంలో ప్యాకేజీ గురించి చంద్రబాబు చెప్పిన గొప్పలను నిస్సంకోచంగా మరిచిపోయిన టీడీపీ సర్కారు.. ఇప్పుడు మళ్లీ హోదా మాట ఎత్తుకుంది. హోదా సాధనకు ప్రజలు ఆందోళనలకు సిద్ధమవుతుండటం, హోదా కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ పోరాటాలను తీవ్రతరం చేసిన నేపథ్యంలో హోదా కోసం బాబు ప్రభుత్వం తీర్మానం చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హోదాపై తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top