మరికొంతకాలం అమిత్‌ షాయే!

Amit Shah Likely to Continue as BJP President - Sakshi

కేరళ, బెంగాల్‌లో బలోపేతంపై దృష్టి

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా అమిత్‌ షా మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరు నెలలపాటు అధ్యక్ష బాధ్యతలను కొనసాగించనున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తాత్కాలిక చీఫ్‌ను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు అమిత్‌షా గురువారం వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులతో భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, 18న ఆఫీస్‌ బేరర్లు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.

రోడ్‌మ్యాప్‌పై కమిటీ
గురువారం నాటి సమావేశంలో అమిత్‌షా.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో బూత్‌ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమైందని కొనియాడారు. బెంగాల్, ఏపీ, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తెలంగాణ, ఒడిశాలలో మంచి ఫలితాలను సాధించిందన్నారు. సంస్థాగత ఎన్నికలతోపాటు ఇతర ప్రధాన అంశాలపై రోడ్‌ మ్యాప్‌ రూపొందించేందుకు  బీజేపీ ఉపాధ్యక్షుడు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, నేతృత్వంలో  కమిటీని ఏర్పాటు చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top