రాహుల్‌కు అమిత్‌ షా కౌంటర్‌.. | Amit Shah Counter To Rahul Gandhi On Twitter | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు అమిత్‌ షా కౌంటర్‌..

May 17 2018 12:38 PM | Updated on May 28 2018 3:58 PM

Amit Shah Counter To Rahul Gandhi On Twitter - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ- బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. అసంబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అంటోంది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఈ రోజు ఉదయం తమ బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కానీ దేశం ప్రజాస్వామ్యం ఓడిపోయినందుకు విచారంలో మునిగిపోయింది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

రాహుల్‌ ట్వీట్‌కు స్పందించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కౌంటర్‌ ఇచ్చారు. ‘కాంగ్రెస్‌ పార్టీ.. జేడీఎస్‌తో చేతులు కలిపి వారికి ఆఫర్‌ ప్రకటించిన(సీఎం పదవి) మరు నిమిషంలోనే ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. కర్ణాటక ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పాకులాడడం సిగ్గుచేటని’  ట్వీట్‌ చేశారు.

కాగా.. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఈ విషయాన్నితాము ప్రజల్లోకి తీసుకెళుతామని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement